పహల్‌గామ్‌లో అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు మతం పేరు అడిగి, ప్యాంట్లు విప్పి తనిఖీ చేసి మరీ కాల్చి చంపేసినప్పుడు… భారత నిఘా వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు, అదంతా మోదీ సర్కారు వైఫల్యమే అని కొంతమంది ఆరోపణలు చేసారు. వారంతా ఎవరో కాదు, వామపక్షవాదులు, ఉదారవాదులు, అభ్యుదయవాదులు అని చెప్పుకునే జాతీయవాద వ్యతిరేకులు. ఆ బ్యాచ్ అంతా ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ మొదలవగానే ఒక్కసారి అవాక్కయ్యారు. కానీ వెంటనే తేరుకుని మరోరకం ఏడుపులు మొదలుపెట్టారు. ఈసారి వారి బాధ ఏంటంటే ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయడం వల్ల శాంతికి నష్టం వాటిల్లుతోందట. భారత్ తన కవ్వింపు చర్యలను మానివేయాలట.
వామపక్ష వాదులు, నరేంద్ర మోదీ ద్వేషులు, సోకాల్డ్ సెక్యులర్ వాదులూ తొలుత పహల్‌గామ్ దాడి జరిగినప్పుడు, ఇస్లామిక్ ఉగ్రవాదులు హిందూ పర్యాటకులను మతం పేరుతో హతమార్చినప్పుడు, మోదీ ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేకపోయింది అంటూ అపహాస్యం పాలు చేసారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పహల్‌గామ్ హత్యలకు ప్రతిచర్య తీసుకుంటే అదే గుంపు అంతా ఇప్పుడు శాంతిదూతలుగా మారిపోయారు. యుద్ధం చేసేస్తున్నారూ, అంతా అరిష్టమే అంటూ మొత్తుకుంటున్నారు.
చిత్ర దర్శకుడినని చెప్పుకునే వినోద్ కాప్రి పహల్‌గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలంటూ ఉచిత సలహాలిచ్చాడు. ఇప్పుడు ‘యుద్ధం వద్దు’ అని ట్వీట్లు పెడుతున్నాడు.
వివాదాస్పద జానపద గాయని నేహాసింగ్ రాథోడ్ తన రెండునాల్కల ధోరణి ప్రదర్శిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిపోయింది. పహల్‌గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవలసిందే అంటూ మొన్నటిదాకా యుద్ధగీతాలు ఆలపించిన ఆమె, ఇప్పుడు భారత్ ప్రతిచర్య ప్రారంభించగానే శాంతి కావాలి అని కోరుకుంటోంది.
జాతీయవాద వ్యతిరేక మీడియా ‘ది వైర్’కు చెందిన అర్ఫా ఖానూమ్ షేర్వాణీ, మొదట పాకిస్తాన్ విషయంలో భారత్ చర్యలేమీ తీసుకోవడం లేదంటూ గోల పెట్టింది. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ మొదలవగానే అదే అర్ఫా ఖానూమ్ ప్లేటు తిప్పేసింది. ‘‘శాంతే దేశభక్తి. యుద్ధమంటే విధ్వంసమే. రక్తమోడేది సరిహద్దులు కావు, ప్రజలు. యుద్ధాన్ని ఆపేయండి. వెంటనే వెనక్కి తగ్గండి’’ అంటూ భారత ప్రభుత్వం మీద గద్దించింది.
పాకిస్తాన్ డ్రోన్ దాడుల నుంచి సరిహద్దు రాష్ట్రాలను కాచుకోవాలని కోరుతున్న భారతీయులను నిందిస్తూ, శాంతి ప్రవచనాలు చెబుతున్నాడు హిందూ వ్యతిరేక యూట్యూబర్ శ్యామ్ మీరా సింగ్.
జర్నలిస్టు, కాలమిస్టు, రచయిత, కవి అని చెప్పుకునే రాజు పరులేకర్, ‘‘యుద్ధంలో భాగస్వామ్యం లేని వాళ్ళు మాత్రమే యుద్ధం కావాలని కోరతారు’’ అని ఎగతాళి చేస్తున్నాడు.
హిందూ వ్యతిరేక ‘ది హిందూ’ గ్రూప్‌కి చెందిన ఫ్రంట్‌లైన్ సంపాదకురాలు, జాతీయవాద వ్యతిరేకి సబా నక్వీకి ఇప్పుడు శాంతి గుర్తొచ్చింది. ‘‘యుద్ధం అందరికీ విధ్వంసకరమే. ప్రజలు భయపడతారు. సైనికులు జీవితాలు కోల్పోతారు. ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. యుద్ధాలు సోషల్ మీడియాలోనో, టీవీ స్టూడియోల్లోనో జరగవు’’ అని సూక్తులు చెబుతోంది. మన సరిహద్దుల పైన పాకిస్తాన్ దాడులు చేస్తుంటే, భారత్ స్పందించకుండా శాంతంగా ఉండాలని కోరుతోంది.
తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసే ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా కకావికలమైపోయాడు. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మీద పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేస్తున్న సమయంలో భారత్ కవ్వింపు చర్యలు ఆపాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహాయ సంపాదకురాలు నిఖిలా హెన్రీ ‘‘మన పిల్లల కోసం, వారి పిల్లల కోసం మనం కవ్వింపు చర్యలు నిలిపేద్దాం. యుద్ధానికి నేను మొదటినుంచీ వ్యతిరేకినే. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడైనా యుద్ధం వద్దనే చెబుతా’’ అంటోంది.
మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి సూడో మేధావులకు కొదవ లేదు. వామపక్ష భావజాలం కలిగిన, అభ్యుదయ వాదం ముసుగు తొడుక్కుని లౌకికవాదపు నటనలు నటించే మహానుభావులు ఎందరో ఉన్నారు. హిందూ వ్యతిరేకతే వాదంగా, హిందూ విద్వేషమే ఊపిరిగా జీవిస్తున్న సోకాల్డ్ సాహితీవేత్తలు, శాస్త్రవేత్తలు, దళితవాదం, క్రైస్తవం, ఇస్లాం తొడుగులతో హిందుత్వం మీద దాడులు చేసే టీచర్లు, ప్రొఫెసర్లు, ప్రభుత్వోద్యోగులు… వీళ్ళందరికీ ఇప్పుడు శాంతి గుర్తొస్తోంది. పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు మతం గుర్తుకు రాని వీళ్ళందరికీ ఇప్పుడు భారత్ ప్రతిచర్యలు తీసుకుంటున్నప్పుడు శాంతి గుర్తొస్తోంది.
రెండు నాల్కలతో మాట్లాడే ధోరణికి, కపట ద్వంద్వ వైఖరికి ఒక పరిమితి ఉంటుంది. దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి శత్రుదేశం విషయంలో ఐకమత్యంగా ఉండాలి. కానీ వామపక్ష వాదులు, మోదీ ద్వేషులు, సోకాల్డ్ సెక్యులర్ వాదులకు అలాంటి వివేచన ఉంటే గొడవేముంది? జరుగుతున్న ఘర్షణలకు కారణమైన పాకిస్తాన్‌ను బాధ్యురాలిని చేయడం మానేసి… యుద్ధ వ్యతిరేకులుగా, శాంతి దూతలుగా నటిస్తున్నారు.