మద్యం కుంభకోణం కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇవాళ మరో ముగ్గురికి నోటీసులు అందించింది. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, సాక్షి ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి, భారతి సిమెంట్స్‌లో శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలకు సిట్ అధికారులు నోటీసులు అందించారు. హైదరాబాద్‌లోని వారి నివాసాల్లో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మే 10న మంగళగిరిలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
మద్యం కుంభకోణంలో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీథర్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఇవాళ ముగ్గురు కీలక నిందితులకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిలను సిట్ అధికారులు విచారణ చేశారు. వైసీపీ పాలనలో రూ.3200 కోట్ల అవినీతి జరిగిందని సిట్ ప్రాథమిక అంచనాకు వచ్చింది. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, అవినీతి సొమ్ము విదేశాలకు తరలించారని సిట్ ఆధారాలు సేకరించింది. అంతిమంగా ఆ సొమ్ము ఎవరికి చేరిందనే విషయంలో ఆరా తీస్తోంది.