పహల్‌గామ్‌లో అమాయకులైన హిందూ పర్యాటకులను ఊచకోత కోసిన ముస్లిం ఉగ్రవాదుల దాడికి ప్రతిస్పందనగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన భారత ప్రభుత్వానికీ, దాన్ని విజయవంతం చేసిన భారత సైనిక బలగాలకూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అభినందనలు తెలియజేసింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇస్తున్న వ్యవస్థలకూ ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా నిర్ణయాత్మకమైన కార్యాచరణను చూపిన భారత సైన్యాన్ని సంఘ్ ప్రశంసించింది. నిరాయుధులు, నిస్సహాయులూ అయిన సాధారణ పర్యాటకులను అమానుషంగా కాల్చి చంపిన ఉగ్రవాద చర్య కారణంగా తీవ్ర ఆవేదనకు లోనయిన కుటుంబాలకు ఈ ఆపరేషన్ న్యాయం చేసిందని సంఘ్ అభిప్రాయపడింది. ఈ చర్యతో యావత్ భారతదేశపు ఆత్మగౌరవం, నైతిక స్థైర్యం ఉత్తేజితమయ్యాయని వ్యాఖ్యానించింది.
ఆపరేషన్ సిందూర్ గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబళే కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసారు. దేశ భద్రత కోసం ఉగ్రవాదుల మీద, వారి స్థావరాల మీద, వారికి అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌లోని వ్యవస్థల మీదా సైనిక చర్య తీసుకోవడం అవసరం, తప్పనిసరి అని పూర్తిగా ఏకీభవిస్తున్నామని వారు పేర్కొన్నారు. భారతజాతి సంక్షోభం ఎదుర్కొంటున్న ఈ సమయంలో యావత్ దేశమూ ప్రభుత్వానికి, సైనిక బలగాలకూ మనసా వాచా కర్మణా అండగా నిలుస్తోందని మోహన్ భాగవత్, దత్తాత్రేయ హొసబళే స్పష్టం చేసారు.
అదే సమయంలో భారతదేశపు సరిహద్దుల్లో పౌర నివాస ప్రాంతాల మీద, ధార్మిక క్షేత్రాల మీదా పాకిస్తాన్ సైన్యం దాడులు చేయడాన్ని ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు తీవ్రంగా ఖండించారు. ఆ అమానుషమైన దాడుల్లో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు హృదయపూర్వకంగా సంతాపం ప్రకటించారు.
ఈ సంక్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగాలు జారీ చేసిన సూచనలకు కట్టుబడి ఉండాలని ఆర్ఎస్ఎస్ దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసింది. దేశ పౌరులుగా మన విధ్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూనే మనందరం జాగ్రత్తగా ఉండాలని సంఘ్ అగ్రనేతలు సూచించారు. దేశంలో సామాజిక ఐక్యతను, సుహృద్భావ వాతావరణాన్నీ దెబ్బతీసేందుకు జాతి వ్యతిరేక శక్తులు పన్నే కుట్రల విషయంలో అప్రమత్తంగా ఉండాలనీ మోహన్ భాగవత్, దత్తాత్రేయ హొసబళే పిలుపునిచ్చారు.