సరిహద్దుల్లో దారుణం జరిగింది. పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. గురువారం రాత్రి సరిహద్దు వెంట గస్తీలో ఉన్న సైనికుడు మురళీపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ సైన్యం కాల్పుల్లో మురళీ నాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మురళీ నాయక్ వీరమరణంపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు మురళీనాయక్ అంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబునాయుడు పోస్ట్ చేశారు.
దేశ రక్షణలో జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమర వీరుడు మురళీ నాయక్. ఆయనకు నివాళులు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానంటూ..సీఎం చంద్రబాబునాయుడు పోస్ట్ పెట్టారు.
మురళీ నాయక్ మృతదేహాన్ని ఇవాళ సాయంత్రానికి స్వగ్రామానికి తెప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో 24 గంటలూ పనిచేసేలా ఓ కాల్ సెంటర్ ప్రారంభించారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయనున్నారు.