ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తరిగిపోతున్నాయని, ప్రజలు వెంటనే కార్లు, బైకుల్లో చమురు నింపుకోవాలంటూ సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలను ఆయిల్ కంపెనీలు కొట్టిపడేశాయి. ఆయిల్ నిల్వలు తగినన్ని ఉన్నాయని, పైపులైన్లు సజావుగా పనిచేస్తున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. కొందరు తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టారని అలాంటి వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రజలు డీజిల్, పెట్రోల్, గ్యాస్ కోసం ఆందోళన చెందాల్సిన పనిలేదని ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రకటించింది.
పాక్‌తో సైనిక ఘర్షణ నేపథ్యంలో దేశంలో ఏటీఎంలు మూసి వేస్తున్నారంటూ వస్తున్న కథనాలను రిజర్వ్ బ్యాంకు తొసిపుచ్చింది. బ్యాంకుల్లో కేవలం మూడు వేలే ఇస్తున్నరంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని బ్యాంకులు స్పష్టం చేశాయి. బ్యాంకులపై ఎలాంటి ఒత్తిడి లేదని అధికారులు స్పష్టం చేశారు. బ్యాంకులు, ఏటీఎంలు సజావుగా పనిచేస్తున్నాయని పలు బ్యాంకులు ప్రకటించాయి.