భారత్ పాకిస్థాన్ మధ్యనెలకొన్న సైనిక ఘర్షణలో తాము జోక్యం చేసుకోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు. రెండు అణుశక్తి కలిగిన దేశాలు ఘర్షణ పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. త్వరగా శాంతి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు.
పాకిస్థాన్‌పై భారత్‌కు కొన్ని అభ్యంతరాలున్నాయి. భారత్ చర్యలకు పాక్ స్పందిస్తోంది. పరిస్థితులు తగ్గుముఖం పట్టేలా చూడాలని జేడీ వాన్స్ అభిప్రాయపడ్డారు. యుద్ధంలో మేం జోక్యం చేసుకోం. అది మా పని కాదని వాన్స్ అన్నారు. భారత్, పాక్ ఆయుధాలు వదిలేయాలని మేం కోరుకోవడం లేదు. కానీ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగకూడదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ సూచించారు. రెండు రోజుల నుంచి అమెరికా ఇరు దేశాలతో వివిధ స్థాయిల్లో చర్చలు జరుపుతోందన్నారు. ఉగ్రదాడి తరవాత భారత్ చర్య ఆశ్చర్యం కలిగించలేదు. పహల్గాం దాడులపై పాకిస్థాన్ స్వతంత్ర దర్యాప్తు కోరుతోంది. ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నామని బ్రూస్ అభిప్రాయపడ్డారు.