జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తానీ ముస్లిం ఉగ్రవాదులు హిందూ పర్యాటకులను హతమార్చిన సంఘటనకు ప్రతిచర్యగా భారతదేశం పాకిస్తాన్, పీఓకేల్లోని ఉగ్రవాద స్థావరాలపై మే 7 ఉదయం 1.44 సమయంలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ ‘ఆపరేషన్ సిందూర్’లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతిపక్ష నేతలతో మాట్లాడారు. 9 ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని వారికి చెప్పారు. సిందూర్ అనేది ఒక్కసారి జరిగిన ఆపరేషన్ కాదని, అది కొనసాగుతూ ఉందని వివరించారు. పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా స్పందించడానికి భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ప్రతిపక్షాలు సైతం, ఉగ్రవాదంపై పోరులో భారత ప్రభుత్వానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని చెప్పాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం చెప్పిన విషయాలు విన్నాం. కొన్ని విషయాలను గోప్యంగా ఉంచాలని వారు చెప్పారు. మేం ప్రభుత్వానికి అండగా ఉన్నామని వారికి చెప్పాం’’ అన్నారు.
అఖిల పక్ష సమావేశం సుహృద్భావ పూర్వక వాతావరణంలో చక్కగా సాగిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. అన్ని పార్టీల నాయకులూ పరిణతితో వ్యవహరించారని ప్రశంసించారు.