సమయం: 2025 మే 7 బుధవారం 1.30 గంటలు. ప్రజలందరూ తమ తమ ఇళ్ళలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. భారత దేశంలోనూ, అటు పొరుగునున్న శత్రు దేశం పాకిస్తాన్‌లోనూ, రెండింటికీ మధ్యలో ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ సామాన్య ప్రజల ఆలోచనల్లో ఉన్నది ఒకటే విషయం. తెల్లవారితే భారతదేశం అంతటా వందలాది నగరాలు, పట్టణాల్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ జరుగుతాయి. అసలు ఎందుకు మే 7న మాక్ డ్రిల్స్ చేపట్టాలని భారత్ నిర్ణయించింది? ఆ మాక్ డ్రిల్స్, త్వరలో జరగబోయే పెద్ద యుద్ధానికి సంకేతమా? అంతకు మించిన ఆలోచన ఎవరికీ ఉండి ఉండదు. కానీ ఆ సమయంలో భారత సైనిక బలగాలు అనూహ్యమైన ఆపరేషన్ చేపట్టాయి. దేశ చరిత్రలోనే ఎన్నడూ అలాంటి ఆపరేషన్ జరగలేదు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లలోని పలు ఉగ్రవాద స్థావరాలపై అత్యంత సాహసోపేతమైన దాడులు చేసాయి. ఆ చర్యకు భారతదేశం పెట్టిన కోడ్‌నేమ్… ఆపరేషన్ సిందూర్.
భారత సైన్యంలోని పదాతి, నౌకా, వాయు దళాలు… అంటే త్రివిధ దళాలూ కలిసి అత్యంత కచ్చితత్వంతో, సమన్వయంతో దాడులు చేసాయి. పాకిస్తాన్, పీఓకేలోని 9 ప్రదేశాల్లో ఉన్న 21 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసాయి. అవి మూడు ఉగ్రవాద సంస్థల స్థావరాలు. మసూద్ అజర్‌కు చెందిన జైష్ ఎ మొహమ్మద్, హఫీజ్ సయీద్‌కు చెందిన లష్కర్ ఎ తయ్యబా, సయ్యద్ సలాహుద్దీన్‌కు చెందిన హిజ్‌బుల్ ముజాహిదీన్ సంస్థల కార్యక్షేత్రాలు ఆ స్థావరాలు.
ఆపరేషన్ సిందూర్ పూర్తయాక ఎక్స్ సామాజిక మాధ్యమంలో భారత సైన్యం ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌లోని ‘న్యాయం జరిగింది’ అనే రెండే రెండు పదాలు ఆసేతు శీతాచలాన్నీ పులకింపజేసాయి. ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో 26మంది అమాయక ప్రజల, ప్రత్యేకించి హిందువుల, ప్రాణాలు మతం పేరు చెప్పి మరీ తీసిన ఉగ్రవాద దుర్మార్గుల దుశ్చర్యకు బాధ్యులైన వారిని జవాబుదారీగా నిలబెట్టాలన్న నిబద్ధతతో చేపట్టిన సైనిక చర్య అది.
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది అని భారతదేశం సగర్వంగా ప్రకటించుకుంది. అయితే దాయాది దేశం మాత్రం ఆ దాడుల సమర్ధత మీద సందేహాలు లేవనెత్తింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ ఆ చర్యను ‘పిరికిపంద దాడి’ అని వ్యాఖ్యానించాడు. దాని పరిణామాలను భారత్ చవిచూస్తుందని హెచ్చరించాడు. అయితే, క్షేత్రస్థాయిలో ఆపరేషన్ సిందూర్ చూపించిన ప్రభావం ఎంత అన్నదాన్ని మనం ఒకసారి విశ్లేషించుకుందాం.
ఉగ్రవాద స్థావరాలు మట్టిదిబ్బలు అయిపోయాయి:
ఆపరేషన్ సిందూర్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఐదు, పాకిస్తాన్‌లోని నాలుగు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా ఎంచుకుంది. వారి లక్ష్యం ఒకటే… భారతదేశంలో పలు ఉగ్రవాద దాడులకు కారణమైన లష్కర్ ఎ తయ్యబా, జైష్ ఎ మొహమ్మద్, హిజ్‌బుల్ ముజాహిదీన్ సంస్థలే వారి లక్ష్యం.
దాడులు చేసిన మొత్తం 21 స్థావరాల్లో ప్రధాన లక్ష్యాలు బహావల్‌పూర్‌లోని జైష్ ఎ మొహమ్మద్ ప్రధాన కేంద్రం, మర్కజ్ సుభాన్ అల్లా… రెండోది మురీడ్కే మర్కజ్‌లోని లష్కర్ ఎ తయ్యబా కీలక స్థావరం, వారి సైద్ధాంతిక, ఆచరణాత్మక శిక్షణా స్థావరం. మురీడ్కేలోని ఈ స్థావరంలోనే, 26-11 ముంబైపై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ కోల్మన్ హెడ్లీ శిక్షణ పొందారు.
ఇప్పుడు, దాడులు జరిగిన ఒక రోజు తర్వాత ఉపగ్రహ చిత్రాలు, వీడియోల ద్వారా ఆ ఉగ్రవాద స్థావరాలకు ఎంత నష్టం వాటిల్లిందన్న సంగతి క్రమంగా బైటపడుతోంది.
అమెరికాకు చెందిన మాక్సార్ టెక్నాలజీస్ సంస్థ ఉపగ్రహ చిత్రాలు దాడికి ముందు, తర్వాత చిత్రాలను క్యాప్చర్ చేసాయి. బహావల్‌పూర్, మురీడ్కేల్లోని నిషిద్ధ ఉగ్రవాద సంస్థల స్థావరాల మీద భారత దాడుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో ఆ చిత్రాల ద్వారా స్పష్టమైంది.
భారత్ దాడులు చేస్తుందన్న అంచనాలతో బహావల్‌పూర్ క్యాంప్‌లోని విద్యార్ధులను కొద్ది రోజుల క్రితమే అక్కడి నుంచి తరలించివేసారు. అందువల్ల అక్కడ సామాన్య పౌరులు ఎవరూ చనిపోలేదని రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. అయితే భారతదేశపు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్ అధిపతి మసూద్ అజర్ మాత్రం తన కుటుంబానికి చెందిన పదిమంది భారతదేశపు దాడుల్లో చనిపోయారని చెబుతున్నాడు. మసూద్ అజార్ చెప్పిన ప్రకారం అతని అక్క, ఆమె భర్త, అజార్ మేనల్లుడు, అతని భార్య, అజార్ మేనకోడలు, అజార్ సోదరుడు, అతని తల్లి, మరో ఇద్దరు సహచరులూ భారతదేశపు దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులు హతం:
భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో కేవలం పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద మౌలిక వసతులు మాత్రమే ధ్వంసం అవలేదు. సుమారు 70 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారని తెలుస్తోంది. అయితే సాధారణ పౌరులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. పహల్‌గామ్‌లో అమాయక భారత పౌరుల ప్రాణాలను లక్ష్యంగా చేసుకుని చంపేసిన ఉగ్రవాదులను మాత్రమే ఆపరేషన్ సిందూర్ తుడిచిపెట్టేసిందని భారతదేశపు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ‘‘ఈ ఆపరేషన్ మన మిలటరీ బలగాల కచ్చితత్వాన్ని మాత్రమే కాదు, మన నైతిక సంయమనానికి కూడా ప్రతీకగా నిలిచింది. భగవాన్ హనుమంతుడి మాటల్లో చెప్పాలంటే జిన్ మోహి మారా, తిన్ మోహి మారే… అంటే మన దేశపు అమాయకులకు హాని కలిగించిన వారి మీద మాత్రమే మేము దాడులు చేసాం’’ అని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేసారు.
రక్షణ విభాగంలోని ఉన్నత స్థాయి అధికారులు సైతం ఈ ఆపరేషన్ కోసం లక్ష్యాలను ఎంచుకోవడంలో, వాటిపై ఆపరేషన్ నిర్వహించడంలో అమితమైన సంయమనం చూపించామని వెల్లడించారు.
భారతదేశపు దాడుల్లో జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాది యాకూబ్ ముగల్ హతమయ్యాడని తెలుస్తోంది. అతను ముజఫరాబాద్‌లోని మర్కజ్ సయద్నా బిలాల్ క్యాంపు నిర్వాహకుడు. ఆ స్థావరంలో 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉండేవారు. జైష్ ఎ మొహమ్మద్ క్యాడర్‌కు ఆ స్థావరంలోనే శిక్షణ ఇచ్చేవారు.
‘ఆకాశం ఎర్రబడింది’:
బుధవారం తెల్లవారుజాముకు ముందు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారతదేశపు క్షిపణులు తమ గగన తలం నుంచి వర్షంలా జాలువారడాన్ని పాకిస్తాన్, పీఓకే ప్రజలు గమనించారు. పాకిస్తాన్‌లోని ముర్డీకేకు చెందిన ఒక స్థానికుడు తాను నాలుగు డ్రోన్‌లను చూసినట్లు చెప్పాడు. రాయిటర్స్ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఆ వ్యక్తి ఇలా చెప్పాడు… ‘‘అప్పుడు సమయం సుమారు అర్ధరాత్రి 12గంటల 45 నిమిషాలు. మేము నిద్రపోతున్నాం. మొదట ఒక డ్రోన్ వచ్చింది. దాని వెనుకనే మరో మూడు డ్రోన్‌లు వచ్చాయి. అవి మసీదులపై దాడి చేసాయి. మొత్తం నాశనమైపోయింది’’.
మరో సాక్షి ఇలా చెప్పుకొచ్చాడు, ‘‘మేము మేడ మీద పడుకున్నాం. మొదట ఒక క్షిపణి పెద్ద శబ్దం చేసుకుంటూ దూసుకొచ్చింది. దాని వెనుకనే మరో మూడు క్షిపణులు వచ్చాయి. ఒకటైతే మా మీదుగా ఎగురుకుంటూ వెళ్ళింది. ఆకాశం అంతా వెలుగుతో నిండిపోయింది. అది ఎలా ఉందంటే ఆకాశం ఎర్రబడినట్టే ఉంది’’.
చాలామంది స్థానికులు ఇంకా భయభ్రాంతుల్లోనే ఉన్నారు. భవిష్యత్తులో ఇంకేం రానుందో అన్న భయం వారిని ఆందోళనలోకి నెట్టేసింది.
ఆపరేషన్ సిందూర్ ప్రభావం:
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాద స్థావరాలకు భౌతికంగా కలిగించిన నష్టం చాలా ఎక్కువే. దానితో పాటు భారత దాడులు ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని పంపించాయి. భారత సైన్యం మీడియా సమావేశంలో చెప్పిన దాని ప్రకారం ఆపరేషన్ సిందూర్ కేవలం గత నెల పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి ఒక్కదానికే స్పందన కాదు. 2001లో భారత పార్లమెంటుపై దాడి మొదలు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాద చర్యలు అన్నింటికీ ప్రతిస్పందనే ఈ ఆపరేషన్.
రక్షణ రంగ నిపుణులు, విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ దాడి పాకిస్తాన్‌కు భారీ ఎదురు దెబ్బ. ప్రపంచ దేశాల్లో దాని ఇమేజ్ నాశనమైపోయింది. భారతదేశం మీద ఉగ్రవాద దాడుల్లో పాకిస్తాన్ రాజ్యపు భాగస్వామ్యం ఉందని తెలిసినా, దాన్ని నిరూపించగల కచ్చితమైన ఆధారాలు లేకపోవడం వెనుక ఆ దేశం ఎప్పటికప్పుడు దాక్కుని ఉండగలిగేది. అలాంటి కవర్‌ను ఈ ఆపరేషన్ సిందూర్ పూర్తిగా తొలగించి పడేసింది. రక్షణ రంగ విశ్లేషకుడు ఆదిల్ మీర్ ఇలా చెప్పారు, ‘‘భారత్ రెండు కీలకమైన అడ్డంకులను అధిగమించింది. ఒకేసారి పలు స్థావరాలపై దాడులు చేయగలిగింది, పాకిస్తాన్ ప్రధాన భూభాగాన్నీ లక్ష్యం చేసుకుని దాడులు చేయగలిగింది. ఇది 2019 కంటె చాలా మెరుగైన పరిస్థితి’’.
దానికి తోడు, ఆపరేషన్ సిందూర్ ఇంకో ఘనత సాధించింది. భారత పాకిస్తాన్ దేశాల మధ్య గతంలో ఉండే సంబంధాలను ముగించివేసింది. ఈ ఆపరేషన్ తర్వాత మళ్ళీ పాత తరహా సమగ్ర చర్చలు, కశ్మీర్ అంశంపై చర్చలు, ప్రజల మధ్య పరస్పర సహకారం వంటి మాటల మాటున సంబంధాలు కొనసాగించే విధానానికి ఇకపై అవకాశం లేదు. అసలు పాకిస్తాన్‌తో సాధారణ సంబంధాలు ఏర్పరచుకోడానికి చర్చలు మొదలు పెట్టాలన్నా కూడా గణనీయమైన సమయం, దానికోసం ప్రయాస అవసరం.