పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలను ధ్వసం చేసిన తరవాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. సమీప గ్రామాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో 15 మంది సాధారణ పౌరులు సహా, ఒక సైనికుడు మరణించారు. దీంతో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.
రాజస్థాన్‌లో పాక్ సరిహద్దును సీజ్ చేశారు. సరిహద్దుల వెంట ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాజస్థాన్‌లో పాక్ సమీపంగా ఉన్న నాలుగు విమానాశ్రయాలను మూసివేశారు. సరిహద్దుల వెంట యుద్ధ విమానాలతో గస్తీ ఏర్పాటు చేశారు. పంజాబ్ పాక్ సరిహద్దుల వెంట ఆరు జిల్లాల్లో బడులకు సెలవులు ప్రకటించారు. సరిహద్దుల వెంట హై అలర్ట్ నడుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడి తరవాత ఉపఖండంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉగ్రమూకల నిర్మూలనే లక్ష్యం సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తరవాత మరింత పెరిగాయి. పాక్ ఎలాంటి చర్యలకు దిగినా తిప్పికొట్టేందుకు సైన్యం సిద్దంగా ఉంది. సైనికులకు సెలవులు రద్దు చేశారు. సెలవుల్లో వున్న వారు వెంటనే విధుల్లోకి రావాలని హో మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.