పాకిస్థాన్ నగరం లాహార్‌లో బాంబుల మోత మోగింది. వాల్టన్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. లాహోర్ విమానాశ్రయం సమీపంలోని గోపాల్ నగర్, నసీరా బాద్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. జనం ఇళ్లు వదిలి పరుగులు తీశారు. సైరన్లు మోగించారు. పేలుడు కారణాలు తెలియాల్సి ఉంది. పేలుళ్ల తరవాత పెద్ద ఎత్తున పొగకమ్ముకున్న వీయోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన మరుసటి రోజే పాకిస్థాన్ నగరం లాహోర్‌లో పేలుళ్లు జరిగాయి. పేలుళ్లకు ఇంత వరకు ఎవరూ బాధ్యత వహించలేదు. ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఓ డ్రోన్ తక్కువ ఎత్తులో వచ్చి పేలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఆత్మాహుతి డ్రోన్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడానికి సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఆపరేషన్ సింధూర్ విషయాలను అన్ని పార్టీలకు వివరిస్తున్నారు. పాక్ దూకుడుగా వ్యవహరిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో అన్ని పార్టీల నేతలతో ప్రధాని మోదీ చర్చిస్తున్నారు.