జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి భారత్ జవాబు చెప్పింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో గత అర్థరాత్రి ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులకు దిగింది. పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో కీలక ఉగ్రవాది కుటుంబంలోని 10 మంది హతమైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. లష్కరే తొయ్యబా, జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలో 10 మంది హతమైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్ాయి.
తాజా దాడుల్లో మసూద్ అజార్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య, మేనకోడలు, ఐదుగురు పిల్లలు చనిపోయినట్లు సమాచారం అందుతోంది. జైషే వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాలు వస్తున్నాయి. వీరితోపాటు అజార్ సన్నిహితులు నలుగురు హతమైనట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
భారత్ వైమానిక దళ దాడుల్లో జైషే ప్రధాన కేంద్రం కూడా ఉంది. అంతర్జాతీయ సరిహద్దు రేఖకు 100 కి.మీ దూరంలోని బహవల్పూర్ మర్కజ్ సుబాన్‌పై దాడి చేసింది. జైషే మహ్మద్‌కు ఇది కీలక కేంద్రంగా అనుమానిస్తున్నారు. పుల్వామా దాడికి ఇక్కడ నుంచే పథక రచన చేసినట్లు తెలుస్తోంది. తాజా దాడుల్లో 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ధ్వంసం అయ్యాయి.