పహల్గామ్లో హిందూ పర్యాటకులపై దారుణమైన దాడి జరిగి, 26మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన 15 రోజుల్లోనే భారతదేశం తన ప్రతిస్పందనను బలంగా ప్రకటించింది. నిన్న మంగళవారం అర్ధరాత్రి దాటాక, బుధవారం 1.44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసింది. పాకిస్తాన్లోనూ, పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను గురిచూసి కొట్టి ధ్వంసం చేసింది. భారత సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా ఈ అర్ధరాత్రి ఆపరేషన్ నిర్వహించాయి. ఉగ్రదాడులకు ఇంత వేగంగా, ఇంత నిర్ణయాత్మకంగా భారత సైన్యాలు స్పందించడం ఇదేమీ మొదటి సారి కాదు.
2016లో సెప్టెంబర్ 18న జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాదులు ఉరీ ఆర్మీబేస్ మీద దాడి చేసారు. ఆ దాడిలో 19మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ఆ దాడి జరిగిన కేవలం 11 రోజుల్లోనే, అంటే 2016 సెప్టెంబర్ 29న భారతదేశం వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆ దాడిలో పలు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.
2019లో ఫిబ్రవరి 14న జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్లోని పుల్వామా వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఆ ఘటనలో 40మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దానికి 12 రోజుల తర్వాత, ఫిబ్రవరి 26 నాడు భారత వైమానిక దళం బాలాకోట్ మీద వైమానిక దాడి చేసింది. అక్కడున్న కీలకమైన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
తాజాగా 2025లో ఏప్రిల్ 22న పహల్గామ్లో అమాయక హిందూ పర్యాటకుల మీద ఉగ్రవాదులు దాడి చేసి 26మందిని పొట్టన పెట్టుకున్నారు. వారి భార్యలు, పిల్లల ముందు హిందూ పర్యాటకులను చంపి ఆ మహిళల నుదుటి కుంకుమను తుడిచేసారు. సరిగ్గా 15 రోజుల తర్వాత, అంటే మే 7న భారతదేశం పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. లష్కర్ ఎ తయ్యబా, జైష్ ఎ మొహమ్మద్ సంస్థల ఉగ్రవాద శిబిరాలను తుడిచిపెట్టింది.
ఈ మూడు సంఘటనలలోనూ గుర్తించదగిన విషయం ఏంటంటే ఉగ్రవాదుల దాడులకు ఎప్పుడు ఎలా స్పందించాలి అన్న విషయాన్ని భారతదేశమే నిర్ణయించుకుంది. ఎక్కడ దాడి చేయాలన్న మార్కింగ్ కూడా భారత సైన్యమే చేసుకుంది. ఉరీ, పుల్వామా, పహల్గామ్ మూడు చోట్ల ఉగ్రవాదుల దాడులకూ భారత్ వేగంగా స్పందించింది. ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది.
స్వభావసిద్ధంగా ఎవరితోనూ యుద్ధం చేయకూడదనేది భారతదేశ విధానం. యుద్ధాల వల్ల సమస్యలు పరిష్కారం కావన్నది భారత్ అనుసరిస్తున్న విధానం. అదే సమయంలో ఉగ్రవాదులు దాడులు చేసిన సందర్భాల్లో మాత్రం భారత్ ఏనాడూ చేతులు కట్టుకుని కూర్చోలేదు. ప్రత్యేకించి జాతీయవాద ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉగ్రవాద దాడుల మీద జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోంది. వీలైనంత వరకూ దాడులు జరగకుండా ఆపగలుగుతోంది.
గతంతో పోలిస్తే భారతదేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయన్నది వాస్తవం. యూపీయే పదేళ్ళ హయాంలో ఆసేతు శీతాచలం దేశంలోని ప్రధాన నగరాలు అన్నింటా ఉగ్రవాదులు దాడులు చేసారు. ఢిల్లీ, ముంబై, పుణే, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూరు… ఇలా రక్తమోడని నగరమంటూ లేదు. ఆ పరిస్థితి అయితే మారింది.
కానీ శత్రువు చేతులు ముడుచుకుని కూర్చోడు కదా. ఎలాగైనా కవ్వించి, రెచ్చగొట్టి యుద్ధానికి సిద్ధపడేలా చేస్తాడు. అందుకే ఉగ్రవాదులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. భారత్లోని జాతీయవాద ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం దేశంలోని అంతర్గత శత్రువులకు సైతం నచ్చని వ్యవహారం. అందుకే ఉగ్రవాదులకు పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నవారు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటి అంతశ్శత్రువులను తట్టుకుంటూ బహిరంగ శత్రువుల మీద దాడులు చేయడం సామాన్యమైన విషయం కాదు. ఉగ్రవాదంపై పోరులో భారత్ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ‘ఆపరేషన్ సిందూర్’ మరోసారి నిరూపించింది.