పాకిస్తానీ ముస్లిం ఉగ్రవాదులు పహల్గామ్లో హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారు. దుస్తులు తొలగించి వారు హిందువులా ముస్లిములా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకుని మరీ కాల్చి చంపారు. భార్యల ఎదురుగుండా భర్తలను చంపారు. మీ భర్తలను మేము చంపామన్న విషయాన్ని పోయి మోదీకి చెప్పుకోండి అంటూ ఆ భార్యలను హెచ్చరించారు.
దానికి స్పందనగా భారతదేశం వెంటనే ప్రతిచర్యలు చేపట్టింది. తొలుత ఆర్థికంగా, వనరుల పరంగా పాకిస్తాన్ ఆయువుపట్లను బిగపట్టిన భారతదేశం ఇప్పుడు భౌతిక దాడులకు పాల్పడింది. పహల్గామ్ దాడి జరిగిన రెండు వారాలకు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఆ చర్యకే ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరు పెట్టింది.
‘ఆపరేషన్ సిందూర్’ అన్న పేరును స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపిక చేసారు. ఆ పదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. హిందూ మహిళలు తమకు పెళ్ళయిందని చెప్పడానికి సూచికగా నుదుటన సిందూరం అలదుకొంటారు. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు ఏరికోరి హిందూ పురుషులను ఎంపిక చేసుకుని కాల్చి చంపారు. వారి కుటుంబాలను విచ్ఛిన్నం చేసారు. హిందూ మగవాళ్ళను చుట్టుముట్టి, వారి భార్యలు, పిల్లల ఎదురుగా వారిని కాల్చి చంపారు. ఆ హిందూ పురుషుల భార్యలను విధవలను చేసారు. వారి నుదుటన సిందూరాన్ని తుడిచివేసారు. ఆ హిందూ పురుషుల మరణాలకు ప్రతీకారంగా తీసుకున్న చర్య కాబట్టే, దానికి ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరు పెట్టారు.
భారత సైన్యం తమ చర్య గురించి తొలుత ఎక్స్ మాధ్యమంలో పెట్టిన పోస్ట్ ద్వారా ప్రపంచానికి వెల్లడించింది. ఆ ఎక్స్ పోస్ట్‌లో ‘ఆపరేషన్ సిందూర్’ పేరును ప్రకటించింది. ఒక భరిణెలో నుంచి సిందూరం పక్కకు తొణికి ఒలికిపోయినట్లు అందులో సూచించింది. 25మంది హిందూ మహిళల నొసటన సిందూరాన్ని తుడిచిపెట్టేసిన ఘాతుకానికి చిహ్నం అది. దానికి క్యాప్షన్‌గా ‘‘న్యాయం జరిగింది, జై హింద్’’ అని రాసుకొచ్చారు.
పహల్గామ్లో ఉగ్రవాదులు అనేక రకాల ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అంతకు ముందు కూడా ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగాయి. కానీ ఈ దాడి ఎన్నోరకాలుగా పాశవికమైనది. సాధారణ భారత పౌరులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. వారి మతం ఏమిటో అడిగారు. వారి కుటుంబ సభ్యులు చూస్తుండగానే, వారి కళ్ళ ముందే కాల్చి పడేసారు. వారి భార్యల నుదుటి బొట్టును తుడిచేసారు.
మృతుల్లో ఒకరు, ఇండియన్ నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌కు వారం క్రితమే పెళ్ళయింది. అతని భార్య హిమాన్షీ నర్వాల్ కాళ్ళకు పారాణి ఇంకా ఆరలేదు, ఆమె నుదుటన సిందూరం ఇంకా మెరుస్తూనే ఉంది. ఆమె చేతుల మీద గోరింటాకు ఇంకా పండుతూనే ఉంది. అంతలోనే ఆమె కళ్ళముందే వినయ్ నర్వాల్‌ను హతమార్చారు.
ఉగ్రవాదులు బలి తీసుకున్న మరో హిందువు మంజునాథ రావు. అంతకు ముందురోజే మంజునాథ, ఆయన భార్య పల్లవి కశ్మీర్లో ఒక షికారాలో (పడవ) తిరుగుతూ నవ్వులు పంచుకున్న దృశ్యాలను వీడియో తీసుకున్నారు. తన భర్తను కాల్చేసాక ఆమె సహాయం కోరుతూ నిస్సహాయంగా కన్నీళ్ళు పెట్టిన దృశ్యాలు భారతీయులను కలచివేసాయి. శైలేష్ కలాతియా భార్య శీతల్, బిటన్ అధికారి భార్య సోహిని, శుభం ద్వివేదీ భార్య ఐశన్య, సంతోష్ జగదలే భార్య ప్రగతి జగదలే… ఇలా పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన ప్రతీ ఒక్క వ్యక్తి భార్య కన్నీళ్ళూ దేశం మొత్తాన్ని తడిపేసాయి.
కశ్మీరీ కుంకుమ ధరించి సంతోషంగా తిరిగి రావలసిన స్త్రీమూర్తులు తమ నుదుటి కుంకుమ కోల్పోయి తమ భర్తల రక్తంతో తడిసిన ముఖాలూ చేతులతో ఇళ్ళకు చేరుకుంటే చూపరుల కళ్ళలో సైతం నీళ్ళు ఇంకిపోయాయి. వారందరి గుండెల్లో గడ్డకట్టుకుపోయిన చెమ్మను సిందూరంతో మళ్ళీ బైటకు తీసుకొచ్చింది భారత సైన్యం. అందుకే ఈ చర్యకు ‘ఆపరేషన్ సిందూర్’ అన్నది తగిన పేరుగా నిలిచిపోయింది.