పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాల్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ స్థావరాలు ప్రధానంగా లష్కరే తయ్యబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థల కేంద్రాలు. భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న స్థావరాలు అవి.
భారతదేశంపై విద్వేషంతో భారత్ మీద ఉగ్రదాడులు చేయడానికి, కశ్మీర్‌ను అల్లకల్లోలం చేయడమే ఏకైక లక్ష్యంగా పాకిస్తాన్ తమ భూభాగం మీద పలు ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తోంది. వాటిలో ప్రధానమైనవి లష్కరే తయ్యబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ మొదలైనవి. ఆ సంస్థలు ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి, భారత్‌పై దాడులకు కుట్రలు పన్ని, దానికి తగిన ప్రణాళికలతో భారత్ మీద దాడులను ఆపరేట్ చేసేందుకు తమ కేంద్ర స్థానాలను ఉపయోగించుకుంటున్నాయి. వాటిని గుర్తించిన భారత సైన్యం త్రివిధ దళాల సంయుక్త కార్యక్రమం ‘ఆపరేషన్ సిందూర్’తో ఆ స్థావరాలను ధ్వసం చేసింది. వాటి వివరాలు చూద్దాం…
1. బహావల్పూర్ – జైషే మొహమ్మద్ ప్రధాన కేంద్రం:
పాకిస్తాన్లో ఉన్న దక్షిణ పంజాబ్‌లోని ప్రధాన నగరం బహావల్పూర్. మసూద్ అజార్ నేతృత్వంలోని ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రధాన కేంద్రం ఆ నగరంలోనే ఉంది. 2001 భారత పార్లమెంటుపై దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి సహా భారతదేశం మీద పలు ఉగ్రవాద దాడులు చేసిన సంస్థ జైషే మొహమ్మద్.
2. మురీడ్కే – లష్కరే తయ్యబా శిక్షణా స్థావరం:
మురీడ్కే పట్టణం పాకిస్తాన్‌లోని ప్రధాన నగరం లాహోర్‌కు ఉత్తరాన సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. లష్కరే తయ్యబా, దాని ముసుగు సంస్థ జమాత్ ఉద్ దావా సంస్థల ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. 200 ఎకరాల్లో విస్తరించి ఉన్న మురీడ్కే ఉగ్రవాద స్థావరంలో భారత్‌పై విద్వేషాన్ని నూరిపోసే సిద్ధాంతాల రూపకల్పన – బోధన కేంద్రాలు, ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు, భారత్‌లోకి చొరబడేందుకు రవాణా సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లూ ఉన్నాయి. 2008లో ముంబై నగరంపై దాడులకు పాల్పడింది లష్కరే తయ్యబా సంస్థే. ఆనాటి 26/11 దాడికి ఉగ్రవాదులకు మురీడ్కేలోనే శిక్షణ ఇచ్చారు.
3. కోట్లీ – బాంబింగ్ శిక్షణా కేంద్రం, ఉగ్రవాదులను భారత్‌లోకి పంపే ప్రదేశం:
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని కోట్లీలో ఉగ్రవాదులకు భారతదేశంలోకి చొరబడడం ఎలా, భారత్‌లో ఆత్మాహుతి దాడులు చేయడం ఎలా అన్న శిక్షణ ఇస్తారు. కోట్లీలోని స్థావరంలో ఒకేసారి 50మందికి ఆశ్రయం కల్పించి, వారికి బాంబులు వేయడంలో తర్ఫీదు ఇచ్చేందుకు వెసులుబాటు ఉంది.
4. గుల్పూర్ – రాజౌరీ,పూంఛ్ జిల్లాలపై దాడులకు లాంచ్‌ప్యాడ్
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో ఉగ్రవాద దాడులు చేయడానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ స్థావరాన్ని వినియోగిస్తున్నారు. 2023, 2024 సంవత్సరాల్లో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడడానికి… రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో భారత పౌరుల మీద, భారత భద్రతా బలగాల మీదా దాడులు చేయడానికి ఈ స్థావరాన్ని ఉపయోగించారని భారత సైనిక వర్గాల విశ్లేషణ.
5. సవాయ్ – లష్కరే తయ్యబా క్యాంప్:
ఉత్తర కశ్మీర్‌లోని సోన్మార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ వంటి ప్రదేశాల్లో దాడి చేయడానికి పాక్ ప్రేచేపిత ఉగ్రవాదులు సవాయ్ ఉగ్రవాద స్థావరాన్ని వినియోగించుకుంటూ వచ్చారు.
6. సర్జల్, బర్నాలా – చొరబాటు మార్గాలు:
భారత పాకిస్తాన్ దేశాల మధ్య వాస్తవాధీన రేఖకు, అంతర్జాతీయ సరిహద్దుకూ చేరువలో ఉన్న ప్రాంతాలు సర్జల్, బర్నాలా. ఈ ప్రదేశాల నుంచి పాకిస్తానీ ముస్లిం ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడుతుంటారు.
7. మెహ్మూనా – హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరం:
మెహ్మూనా క్యాంప్ సియాల్కోట్కు చేరువలో ఉంది. కశ్మీర్లో చిరకాలంగా క్రియాశీలంగా ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఈ ప్రదేశాన్ని స్థావరంగా వినియోగించుకుంటోంది. ఈమధ్య కాలంలో హిజ్బుల్ ముజాహిదీన్ ప్రత్యక్ష ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయి, కానీ అక్కడ ఉగ్రవాదులకు అండగా నిలిచే స్థానికులు పెద్దసంఖ్యలో ఉన్నారు. అందువల్ల ఉగ్రవాదులకుశిక్షణ ఇవ్వడం, వారిని భారత్‌లోకి ప్రవేశపెట్టడానికి ఈ స్థావరాన్ని ఇప్పటికీ వినియోగిస్తున్నారని భారత సైన్యం గుర్తించింది.
భారత సైన్యం మొత్తంగా 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసింది. అవి…
1. మర్కజ్ సుభాన్ అల్లా, బహావల్పూర్ (జైష్ ఎ మొహమ్మద్)
2. మర్కజ్ తయ్యబా, మురీడ్కే (లష్కర్ ఎ తయ్యబా)
3. తెహ్రా కలాన్, సర్జల్ (జైష్ ఎ మొహమ్మద్)
4. మెమ్‌మూనా జోయా, సియాల్కోట్ (హిజ్బుల్ ముజాహిదీన్)
5. మర్కజ్ అహల్ హడీత్, బర్నాలా (లష్కర్ ఎ తయ్యబా)
6. మర్కజ్ అబ్బాస్, కోట్లీ (జైష్ ఎ మొహమ్మద్)
7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లీ (హిజ్బుల్ ముజాహిదీన్)
8. సవాయ్ నల్లా క్యాంప్, ముజఫరాబాద్ (లష్కర్ ఎ తయ్యబా)
9. సయద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ (జైష్ ఎ మొహమ్మద్)