మే 7వ తేదీన అంటే రేపు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశంలోని పలు రాష్ట్రాలను కోరింది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందించడానికి భారతదేశం ఈ పౌర రక్షణ మాక్‌డ్రిల్ నిర్వహిస్తోంది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, దేశం ఏ అత్యవసర పరిస్థితికైనా సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవడానికి ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు, వారి హ్యాండ్లర్స్కు, వారి మద్దతుదారులకు, ఇంకా పాకిస్తాన్‌కు బలమైన సందేశం ఇచ్చేందుకు భారీ ఆపరేషన్ చేపట్టాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఆ దుండగులు తమ దుర్మార్గ చర్యకు ఎదుర్కొనబోయే పరిణామాలను ఎప్పటికీ మరచిపోకుండా ఉండేలా ఆ ఆపరేషన్ ఉండాలనేది లక్ష్యం.
దేశంలో సివిల్ డిఫెన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పరీక్షించడమే మే 7 బుధవారం నాడు నిర్వహించబోయే మాక్ డ్రిల్స్ ప్రధాన ఉద్దేశం. ఆ డ్రిల్స్‌లో పలు ముఖ్యమైన విషయాలను పరీక్షిస్తారు.
మాక్ డ్రిల్స్‌లో ఏం చేస్తారంటే…. :
ఎయిర్ రైడ్ వార్నింగ్ సిస్టమ్స్ : వార్నింగ్ అలారంలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా తనిఖీ చేయడం
హాట్‌లైన్, రేడియో లింక్స్ : భారత వైమానిక దళంతో కమ్యూనికేషన్ వ్యవస్థ సజావుగా ఉందో లేదో చూడడం
కంట్రోల్ రూమ్స్ : మెయిన్, బ్యాకప్ కంట్రోల్ రూమ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయడం
ప్రజలకు శిక్షణ : ఏదైనా దాడి జరిగినప్పుడు సురక్షితంగా ఎలా ఉండాలన్న విషయాన్ని సాధారణ పౌరులు, విద్యార్ధులు, తదితరులకు బోధించడం
బ్లాక్ ఔట్ చర్యలు : శత్రువు గుర్తించకుండా ఉండేందుకు వీలుగా దీపాలను సాధ్యమైనంత వేగంగా ఆర్పివేసేలా జాగ్రత్తలు తీసుకోవడం
కెమోఫ్లాజ్ : ప్రధానమైన భవనాలు, పరిశ్రమలను త్వరగా దాచిఉంచగలిగేలా చర్యలు తీసుకోవడంలోని సాధ్యాసాధ్యాలను పరిశీలించడం
సివిల్ డిఫెన్స్ (పౌర రక్షణ) సేవలు : ఫైర్ ఫైటర్లు, రెస్క్యూ వర్కర్ల వంటి వారు త్వరగా స్పందించేలా చర్యలు తీసుకోవడం
తరలింపు ప్రణాళికలు : ప్రజలను సురక్షిత ప్రదేశాలకు వేగంగా, భద్రంగా తరలించడంలోని సాధ్యాసాధ్యాలను పరీక్షించడం
మాక్ డ్రిల్స్‌కు హోంశాఖ సూచనలు – పహల్గామ్ దాడికి భారత్ స్పందనకు సంకేతాలు :
పౌర రక్షణ మాక్ డ్రిల్స్ చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. పహల్గామ్లో హిందూ పర్యాటకుల మీద పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ముస్లిం ఉగ్రవాదులు చేసిన దాడికి బాధ్యుల మీద కీలకమైన చర్యలు తీసుకోడానికి న్యూఢిల్లీ సిద్ధమవుతోంది అనడానికి ఇది ఒక బలమైన సంకేతం. పాకిస్తాన్ మద్దతు కలిగిన ఉరవాదులు అమాయక భారతీయ హిందూ పర్యాటకులను కాల్చి చంపేసిన పహల్గామ్ ఘాతుకం తర్వాత నుంచీ భారతదేశం చాలా అప్రమత్తంగా ఉంది. ఆ పర్యాటకులు కశ్మీర్లో ప్రశాంతంగా గడుపుదామనే ఉద్దేశంతో పహల్గామ్ వెళ్ళారు. ఉగ్రవాదులు ఆ పర్యాటకుల్లో హిందువులను ఎంచుకుని వారిని వారి భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబాలు చూస్తుండగానే దారుణంగా హతమార్చారు. ప్యాంట్లు విప్పి సున్తీ అయిందో లేదో తనిఖీ చేసి హిందువులు అని నిర్ధారించుకున్నాకే వారిని కాల్చి చంపేసారు.
ఆ ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇస్తున్న వారికీ బలమైన సందేశం ఇవ్వడం కోసం, ఆ దాడికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం భారతదేశం విస్తృతంగా రచిస్తున్న ప్రణాళికలో ఒక భాగమే ఈ మాక్ డ్రిల్స్. మే 7 బుధవారం నాడు దేశంలోని పలు ప్రాంతాల్లో భారతదేశం సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది. ఎటునుంచి ఎలాంటి దాడులు జరిగినా వాటికి దేశం ఎంత సంసిద్ధంగా ఉందన్నది పరీక్షించుకోవడమే ఈ మాక్ డ్రిల్స్ ప్రధాన ఉద్దేశం. కేంద్ర హోంశాఖ దేశంలోని 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది. ప్రధానంగా భద్రతా పరమైన సమస్యలు ఉన్న ప్రదేశాలను ఎంచుకుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికార యంత్రాంగాల సహాయంతో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, హోం గార్డులు, ఎన్సిసి క్యాడట్లు, విద్యార్ధులు, స్వచ్ఛంద సేవకులు ఈ మాక్ డ్రిల్స్‌లో పాల్గొంటారు.
సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్‌లో ఏముంటాయంటే…. :
గగన తలం నుంచి దాడులు జరుగుతుంటే హెచ్చరించేలా ఎయిర్ రైడ్ సైరన్స్ ధ్వనులు చేస్తాయి.
రాత్రివేళల్లో గగన తలం నుంచి దాడులను రక్షించుకునేందుకు నగరాల్లో దీపాలు ఆర్పేయడం, బ్లాక్ ఔట్ చేయడం ఎలా అన్నది అభ్యాసం చేస్తారు.
ప్రజలను ఎంత వేగంగా భద్రంగా సురక్షిత స్థలాలకు చేర్చాలో తనిఖీ చేసుకునేందుకు తరలింపు ప్రక్రియలు అభ్యసిస్తారు.
ఈ సంక్షోభ సమయంలో పౌర రక్షణ వ్యవస్థలు, అత్యవసర బృందాలు, సాధారణ ప్రజలు ఎలా స్పందిస్తారో పరీక్షించడమే ఈ డ్రిల్స్ లక్ష్యం.
నిజమైన ముప్పు ముంచుకొచ్చినప్పుడు ఎదుర్కోడానికి దేశం ఎంత సంసిద్ధంగా ఉందో తెలుసుకుని, దాన్ని మరింత మెరుగు పరచుకోవడానికి ఏం చేయాలో ప్రభుత్వం తెలుసుకోడానికి ఈ మాక్ డ్రిల్స్ సాయపడతాయి.
ఈ మాక్ డ్రిల్స్ నగరాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేపడతారు. అందులో ప్రధానంగా ఎయిర్ రైడ్ సైరన్లు, క్రాష్ బ్లాక్ ఔట్లు, కెమోఫ్లాజ్ డ్రిల్స్, తరలింపు ప్రక్రియ అభ్యాసాలూ ఉంటాయి.
ప్రతీ ఒక్కరికీ సివిల్ డిఫెన్స్ శిక్షణ :
మాక్ డ్రిల్స్‌లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లకు ప్రత్యేక అవగాహనా తరగతులు నిర్వహిస్తారు. ఆ సెషన్స్‌లో ఏం నేర్పిస్తారో ఒక్కసారి తెలుసుకుందాం.
ఏదైనా దాడి జరిగినప్పుడు లేదా అత్యవసర పరిస్థితిలో సురక్షితమైన ప్రదేశాన్ని కనుగొనడం, ఎవరైనా గాయపడితే వారికి కనీస ప్రాథమిక చికిత్స చేయడం, సంక్షోభ సమయంలో ప్రశాంతంగా ఉండడం, తెలివిగా వ్యవహరించడం, తమను తాము కాపాడుకోవడం ఎలా అన్న విషయాలు నేర్పిస్తారు.
ఏదైనా ప్రమాదం జరిగితే అలాంటి సమయాల్లో ఏం చేయాలి, తమతో పాటు ఇతరులకు ఎలా సహాయం చేయాలి అన్న విషయాలు అందరికీ తెలిసి ఉండడమే ఈ మాక్ డ్రిల్ లక్ష్యం.
1971లో నిర్వహించిన మాక్ డ్రిల్:
భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు సివిల్ డిఫెన్స్ సంసిద్ధతలో ఈ మాక్ డ్రిల్స్ అనేవి కీలక పాత్ర పోషించాయి. 1971లో ఆ మాక్ డ్రిల్స్ దేశవ్యాప్తంగా నిర్వహించారు. ప్రత్యేకించి సరిహద్దు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో చేపట్టారు. పాకిస్తాన్ చేయగలిగే దాడుల గురించి సాధారణ పౌరులు, అధికారులను సంసిద్ధం చేయాలి.
1971 డిసెంబర్లో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఢిల్లీ, అమృత్సర్, జమ్మూ, కోల్‌కతా, బొంబాయి వంటి నగరాలపై వైమానిక దాడులు జరగడానికి చాలా వీలు ఉంది. గగన తలం నుంచి దాడులు జరుగుతాయనీ, సర్వం ధ్వంసమైపోతుందనీ నాటి ప్రభుత్వం భయపడింది. అందువల్ల పౌర రక్షణ సంసిద్ధత అనే దానికి అత్యవసర ప్రాధాన్యం ఇవ్వాల్సిందే.
1971 డిసెంబర్ 3:
పాకిస్తాన్ భారత ఎయిర్ బేస్‌లపై దాడి చేసింది. భారత్‌ను ఆశ్చర్యానికి లోను చేయాలనుకుంది. దానికి స్పందనగా భారతదేశం పాకిస్తాన్ మీద అధికారికంగా యుద్ధం ప్రకటించింది.
1971 డిసెంబర్ 4 – 14 :
భారత బలగాలు వేగంగా కదిలాయి. తూర్పు పాకిస్తాన్లో (నేటి బంగ్లాదేశ్) పలు ప్రాంతాల మీద పట్టు సాధించాయి. వాటిని తమ గుప్పెట్లోకి తీసుకున్నాయి. భారత సైన్యం, తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర సమరయోధుల సంఘం ముక్తి వాహిని కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో పాకిస్తానీ బలగాలను వెనక్కు తిప్పి కొట్టారు.
1971 డిసెంబర్ 16:
పాకిస్తాన్ తూర్పు కమాండ్ ఢాకాలో లొంగిపోయింది. 93వేల మందికి పైగా పాకిస్తానీ సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద మిలటరీ లొంగుబాటు అదే.
1971 మాక్ డ్రిల్స్‌లో ప్రధాన ఘట్టాలు:
ఎయిర్ రైడ్ సైరన్లు:
దేశంలోని పలు నగరాల్లో గగన తలం నుంచి దాడులు జరిగితే ఎలా ఉంటుందో తెలియడానికి సైరన్లను ఉపయోగించారు. సైరన్ మోత వినబడగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయేలా ప్రజలకు శిక్షణ ఇచ్చారు.
బ్లాక్ ఔట్లు:
సైరన్ ఎలర్ట్‌లు రాగానే అన్ని దీపాలూ ఆర్పేసేలా దేశ పౌరులకు సూచనలు అందజేసారు. ఇళ్ళు, భవనాల్లో ప్రత్యేకమైన బ్లాక్ ఔట్ కర్టెన్లు ఉపయోగించే వారు.
శత్రువుల విమానాలు రాత్రి వేళల్లో లక్ష్యాలను గుర్తించకుండా వీధి దీపాలు, దుకాణాల సైన్ బోర్డులను సైతం నిలిపివేసారు.
తరలింపు అభ్యాసాలు:
భూగర్భ షెల్టర్లు లేదా ముందే నిర్ణయించిన సురక్షిత ప్రదేశాలకు వేగంగా వెళ్ళిపోవడం ఎలా అనే అంశంపై ప్రజలు అభ్యాసం చేసారు.
పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తరలింపు ప్రక్రియలను అభ్యసించారు.
కెమోఫ్లాజ్ చర్యలు:
ప్రభుత్వ భవనాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంటులకు వలలు, ఇతరత్రా తొడుగులూ ఉపయోగించి వాటిని కెమోఫ్లాజ్ చేసారు. తద్వారా శత్రు విమానాలకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రజలకు శిక్షణ :
చిన్నచిన్న గాయాలు తగిలినప్పుడు, చిన్నచిన్న మంటల్లో చిక్కుకున్నప్పుడు వాటిని ఆర్పివేయడం, రెస్క్యూ ఆపరేషన్స్‌లో చిన్నచిన్న సహాయాలు చేయడానికి వీలుగా సాధారణ పౌరులకు సైతం శిక్షణ ఇచ్చారు. మౌలికమైన ప్రథమ చికిత్స, స్వీయ రక్షణ పద్ధతుల గురించి విద్యార్ధులు, స్వచ్ఛంద సేవకులకు బోధించారు.
రేడియో, బహిరంగ ప్రకటనల వినియోగం:
ప్రజలకు సూచనలు ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం చేసే వారు. స్థానిక అధికారులు లౌడ్ స్పీకర్ల ద్వారా సూచనలు ప్రసారం చేసే వారు. సామాజిక కేంద్రాల దగ్గర మాక్ డ్రిల్స్ చేసే వారు.
1971కీ 2025కూ తేడాలేంటి?
1971లో పాకిస్తాన్‌తో పూర్తిస్థాయి యుద్ధం జరిగింది. 2025లో శాంతియుత పరిస్థితులే ఉన్నాయి కానీ ఉగ్రవాద ఘటనల తర్వాత ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
1971లో సంప్రదాయిక ఆయుధాలతో సాధారణ యుద్ధం జరిగింది. 2025లో ఉగ్రవాదం, సైబర్ దాడులు, డ్రోన్ల ప్రయోగాన్ని కలిపిన హైబ్రిడ్ ముప్పు పొంచివుంది.
ప్రజలకు ముప్పు 1971లో సరిహద్దులకు చేరువగా ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండేది. 2025లో అన్ని మెట్రో నగరాలు, ద్వితీయ శ్రేణి పట్టణాలు అన్నింటికీ ముప్పు ఉంది.
సివిల్ డిఫెన్స్ (పౌర రక్షణ) దృష్టి 1971లో ప్రధానంగా బాంబు దాడులు జరిగినప్పుడు మనుగడను కొనసాగించడం ఎలా అనే కోణంలో ఉండేది. 2025లో నగర ప్రాంతాల్లో సైబర్, డిజిటల్ దాడుల వంటి అన్ని రకాల ప్రమాదాలనూ ఎదుర్కోవడం అనే కోణంలో ఉంది.
1971లో రేడియోలు, సైరన్లు, శారీరకమైన డ్రిల్స్ ఉండేవి. ఇప్పుడు 2025లో డిజిటల్ అలర్ట్‌లు, డ్రోన్ నిఘా, వైమానిక దళం సంబంధాలూ ఉన్నాయి.
భారతదేశం తక్షణమే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించవచ్చు, ప్రకటించకపోనూ వచ్చు. ఈ ఆధునిక కాలంలో శత్రువును దెబ్బతీయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. పరోక్ష దాడులతో హడలెత్తించవచ్చు, ఆర్థిక పరంగా దెబ్బ తీయవచ్చు. ఇప్పుడు మోదీ సర్కారు చేసినట్లు నీటిని కట్టివేసి బెంబేలెత్తించవచ్చు. కానీ శత్రువు దాడి చేస్తే ఎదుర్కోడానికి మాత్రం ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండాలి. యుద్ధ పరిస్థితులను అంచనా వేయగలగాలి. అందుకే ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.