ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్థన్‌రెడ్డి, ఆయన బావ మరిది శ్రీనివాసరెడ్డి, గాలి జనార్ధన్‌రెడ్డి పీఏ అలీఖాన్, గనుల శాఖ మాజీ అధికారి రాజగోపాల్‌రెడ్డిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. దోషులకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఏ5గా ఉన్న లింగారెడ్డి ఇప్పటికే చనిపోయారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను నిర్దోషులుగా తేల్చింది. 2022లో ఐఏఎస్ శ్రీలక్ష్మిని కోర్టు నిర్ధోషిగా ప్రకటించి డిశ్చార్జ్ చేసింది.
2009లో అప్పటి ప్రభుత్వం ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు నమోదు చేసింది. ఏపీ, కర్ణాటక సరిహద్దులు మార్చి రూ.882 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. గాలి జనార్థన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలీఖాన్, రాజగోపాల్‌రెడ్డి,లింగారెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలపై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన సీబీఐ 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ తరవాత నాలుగు ఛార్జిషీట్లు దాఖలు చేసింది.
సుదీర్ఘ కాలం కేసు విచారణ జరగడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మే 10లోగా ఈ కేసులో తీర్పు వెలువరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడంతో, నాంపల్లి సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. 15 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తరవాత నాంపల్లి సీబీఐ కోర్టు నలుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది.