ముఖ్యాంశాలు
— భారతదేశం పాకిస్తాన్ నుంచి దిగుమతులు, ఆ దేశానికి పోస్టల్ సేవలు, పాక్‌తో షిప్పింగ్ సంబంధాలను పూర్తిగా నిషేధించింది
— సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, పాకిస్తానీ దౌత్యవేత్తలు, సెలబ్రిటీలను బహిష్కరించింది
— పహల్గామ్ దాడి తర్వాత కశ్మీర్లో ఉగ్రవాద అనుమానితుల ఇళ్ళను భద్రతా బలగాలు కూల్చివేసాయి
భారతదేశం 2025 ఏప్రిల్ 22న ఘోరమైన ఉగ్రవాద దాడిని ఎదుర్కొంది. జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పీర్ పంజాల్ ప్రాంతంలోని పహల్గామ్లో 26మంది పర్యాటకులను వారు హిందువులా కాదా అన్న విషయం కనుక్కొని మరీ ఉగ్రవాదులు హత్య చేసారు. హిందువులనే లక్ష్యంగా చేసుకుని, ప్రణాళికాబద్ధంగా చేసిన ఆ ఊచకోత యావత్ దేశాన్నీ వణికించింది. ఉగ్రవాదులు పర్యాటకులను చుట్టుముట్టి, వారి మతం ఏమిటో కనుక్కుని, వారిలో హిందువులను ఏరి కాల్చి చంపారు. బాధితులు హిందువులా ముస్లిములా అన్న విషయం తెలుసుకోవడం కోసం వారిని ఇస్లామిక్ ప్రార్థన (కల్మా) చదవమని అడిగారు. అలా చేయలేకపోయిన వారు, లేదా దానికి నిరాకరించిన వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసారు అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
మన దేశంలో ఉగ్రవాద చర్యలకు సరిహద్దులకు ఆవలి నుంచి మద్దతు అందిస్తున్న పాకిస్తాన్ మీద భారతదేశం కఠిన చర్యలు తీసుకుంది. గత శనివారం నాడు అంటే మే 3వ తేదీన భారత్ మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ నుంచి అన్ని దిగుమతుల మీదా నిషేధం విధించింది. రెండు దేశాల మధ్యా అన్ని పోస్టల్ సేవలనూ నిలిపివేసింది. భారతీయ ఓడరేవుల్లో పాకిస్తానీ ఓడలను డాక్ చేయడంపై నిషేధం విధించింది. మన దేశంలో ఉగ్రవాద చర్యలకు సరిహద్దులకు ఆవలి నుంచి అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడం కోసమే భారత ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది.
పహల్గామ్ ఉగ్ర దాడి తరవాత పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న చర్యలు అన్నింటినీ ఒకసారి పరిశీలిద్దాం.
01. అన్ని దిగుమతుల మీదా నిషేధం:
పాకిస్తానీ వస్తువులు భారతదేశంలోకి ప్రత్యక్షంగా లేక ఇతర దేశాల ద్వారా ప్రవేశించడాన్ని నిలువరించేందుకు భారతదేశం కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ నుంచి దిగుమతులు, పాక్ వస్తువుల రవాణా (ట్రాన్సిట్) మీద పూర్తి నిషేధం విధించింది. ఆ మేరకు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మే 2న అధికారికంగా నోటిఫికేషన్ వెలువరించింది. అంతకు ముందు, ఏప్రిల్ 24, భారతదేశం పాకిస్తాన్‌తో ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపివేసింది. అట్టారీ సరిహద్దు చెక్‌పాయింట్‌ను మూసివేసింది. ఆ చర్య వల్ల సుమారు 3900 కోట్ల వాణిజ్యంపై ప్రభావం పడింది. అయితే ఇతర దేశాల ద్వారా కొన్ని పాకిస్తానీ వస్తువులు భారత్‌లోకి వస్తూన్నాయి. దాంతో పూర్తిస్థాయి నిషేధం విధించింది.
ఈ చర్యల ద్వారా ప్రభుత్వం ఒక విషయం స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి ఏ వస్తువులూ దిగుమతి చేసుకోబడవు, మరే ఇతర మార్గాల ద్వారా భారత్ నుంచి రవాణా చేయబడవు. భారతదేశం గతంలో పాకిస్తాన్‌కు సోయాబీన్స్, పౌల్ట్రీ ఫీడ్, కూరగాయలు, ప్లాస్టిక్ వస్తువులు ఎగుమతి చేసేది. డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు, సిమెంట్, గ్లాస్, ఉప్పు, మూలికలు వంటివి దిగుమతి చేసుకునేది. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి.
02. పాకిస్తానీ ఓడలకు భారతీయ రేవులు బంద్ :
పాకిస్తాన్ ఓడలకు ఇకపై భారతదేశపు ఓడరేవుల్లోకి ప్రవేశం లేదని భారతదేశం ప్రకటించింది. అదే సమయంలో, భారతీయ నౌకలను కూడా పాకిస్తాన్ రేవుల్లోకి వెళ్ళడం మీద నిషేధం విధించింది. భారతదేశంలో మారిటైమ్ అథారిటీ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డిజిఎస్) ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ నౌకలు, వాటిలోని సరుకులు, ఓడరేవుల్లోని మౌలిక వసతులను రక్షించేందుకే తక్షణ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిజిఎస్ వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఇదే నిర్ణయం అమల్లో ఉంటుంది.
డిజిఎస్ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ‘‘పాకిస్తాన్‌కు చెందిన ఏ నౌకా భారతదేశంలోని ఏ ఓడరేవుకూ రాలేదు. భారతదేశానికి చెందిన ఏ నౌకా పాకిస్తాన్‌లోని ఏ ఓడరేవుకూ వెళ్ళలేదు.’’ భారత పాకిస్తాన్ దేశాల మధ్య సముద్ర వాణిజ్యం ఎప్పుడూ చాలా పరిమితంగానే ఉంది. నిజానికి రెండు దేశాలూ అరేబియా సముద్రంలో ఒకే సముద్ర తీరాన్ని పంచుకుంటున్నాయి. కానీ ఇరు దేశాల మధ్యా సంబంధాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున ఇరు దేశాల మధ్యా నౌకా కార్యకలాపాలను కనిష్ఠ స్థాయికి పరిమితం చేసేసారు.
03. ఉత్తర ప్రత్యుత్తరాలు నిలిపివేత:
శనివారం నాడు భారత ప్రభుత్వం అధికారికంగా పాకిస్తాన్‌తో అన్ని రకాల పోస్టల్ సేవలూ నిలిపివేసింది. భూ, వాయు మార్గాల ద్వారా మెయిల్, పార్సిల్ సేవల పరస్పర మార్పిడిపై నిషేధం విధించింది. సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ తీసుకున్న తాజా చర్యల్లో ఇది ఒకటి. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని పోస్టల్ విభాగం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చే ఉత్తరాలు, పార్సెళ్ళను ఇంకెంత మాత్రం స్వీకరించకూడదని దేశంలోని అన్ని పోస్టల్ కార్యాలయాలకూ సంబంధిత మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
నిజానికి భారత పాకిస్తాన్ దేశాల మధ్య దాదాపు ఐదేళ్ళుగా పోస్టల్ సేవలు నిలిచిపోయాయి. 2019 ఆగస్టులో భారతదేశం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగ అధికరణం 370ని తొలగించినప్పటి నుంచీ భారతదేశం నుంచి మెయిల్ సేవలను స్వీకరించడాన్ని పాకిస్తాన్ నిలిపివేసింది. రెండు దేశాల మధ్యా అలాంటి చర్య ఒకటి తీసుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి.
04. సోషల్ మీడియాపై ఉక్కుపాదం:
పాకిస్తాన్‌ను చెందిన 16 యూట్యూబ్ ఛానెళ్ళను భారత ప్రభుత్వం నిషేధించింది. వాటిలో డాన్ న్యూస్, సమా టీవీ, ఏరీ న్యూస్, జియో న్యూస్ వంటి పాకిస్తాన్‌లోని ప్రముఖ న్యూస్ ఛానెళ్ళ యూట్యూబ్ ఛానెళ్ళు కూడా ఉన్నాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయగల, వివిధ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను సృష్టించగల కంటెంట్ భారతదేశంలో ప్రసారం అవకుండా ఉండడం కోసం ఆయా ఛానెళ్ళను బ్లాక్ చేసారు. భారతదేశం, భారత సైన్యం గురించి ఆ ఛానెళ్ళలో దుష్ప్రచారం చేస్తున్నాయి. అందుకే వాటి ప్రసారాలను నిలువరించారు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, బాసిత్ అలీల యూట్యూబ్ ఛానెళ్ళను కూడా నిషేధించారు. దానికి తోడు పాకిస్తాన్‌కు చెందిన సెలబ్రిటీలు ఫవాద్ ఖాన్, ఆతిఫ్ అస్లాం, హనియా ఆమిర్, మాహిరా ఖాన్ వంటి వారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను కూడా భారతదేశంలో డిజేబుల్ చేసారు. నటుడు ఫవాద్ ఖాన్ తొమ్మిదేళ్ళ తర్వాత బాలీవుడ్లో ‘అబిర్ గులాల్’ అనే సినిమా చేసాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా విడుదల అవుతుందా లేదా అన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది.
05. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత :
చరిత్రలో మొట్టమొదటిసారి భారతదేశం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా గొప్ప కఠినమైన చర్య తీసుకుంది. భారత పాకిస్తాన్ దేశాల మధ్య అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని (ఇండస్ వాటర్స్ ట్రీటీ – ఐడబ్ల్యూటీ) సస్పెండ్ చేసింది. పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగిన మరునాడే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సరిహద్దులకు ఆవల ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని పాకిస్తాన్ శాశ్వతంగా, విస్పష్టంగా నిలిపివేసేంత వరకూ ఈ ఒప్పందంపై సస్పెన్షన్ కొనసాగుతుందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తొమ్మిదేళ్ళ పాటు చర్చలు జరిపిన తర్వాత 1960లో సింధు జలాల ఒప్పందం మీద సంతకాలు చేసాయి. ఇరు దేశాల మధ్యా నాలుగు యుద్ధాలు, ఎన్నో యేళ్ళ ఉద్రిక్తతలు, సరిహద్దుల వద్ద నిరంతర హింసాకాండ జరిగినా ఏనాడూ సింధు జలాల ఒప్పందం అమలు ఆగలేదు. కానీ ఇప్పుడు భద్రతా పరమైన ఆందోళనల దృష్ట్యా సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.
06. అట్టారీ – వాఘా సరిహద్దు మూసివేత :
భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉన్న అట్టారీ – వాఘా సరిహద్దును మే 1 నుంచి భారతదేశం పూర్తిగా మూసివేసింది. సరిహద్దుల వద్ద కదలికలు బాగా తీవ్రంగా ఉన్న వారం రోజుల తర్వాత భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. స్వల్ప కాలిక వీసాలు తీసుకుని భారతదేశానికి వచ్చిన పాకిస్తానీ పౌరులు అందరూ వెనక్కి వెళ్ళిపోవాలని భారతదేశం ఆదేశించింది. అది పూర్తయాక మే 1 నుంచీ పూర్తిగా అట్టారీ – వాఘా సరిహద్దును మూసివేసింది. నిజానికి పహల్గామ్ దాడి జరిగిన మూడో రోజు అంటే ఏప్రిల్ 25నే సరిహద్దుల్లోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను మూసివేసారు. అప్పటినుంచీ 780కి పైగా పాకిస్తాన్ జాతీయులు భారతదేశం నుంచి తమ స్వదేశానికి వెళ్ళిపోయారు. అదే సమయంలో భారత పౌరులు, దీర్ఘకాలిక వీసాలు కలిగిన పాకిస్తానీయులు సుమారు 1560 మంది భారతదేశంలోకి వచ్చారు.
07. వీసా మినహాయింపుపై వేటు – పాక్ జాతీయులపై సార్క్ నిషేధం :
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ జాతీయులు సార్క్ వీసా మినహాయింపు పథకం (ఎస్‌విఇఎస్) కింద భారతదేశంలోకి రాగల అవకాశాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ దేశస్తులకు ఇప్పటికే ఇచ్చిన ఎస్‌విఇఎస్ వీసాలు ఇక రద్దయిపోయాయని, అలాంటి వీసాలతో ఇప్పటికే భారత్ వచ్చిన వారు 48 గంటలలోగా దేశం వదిలి వెళ్ళిపోవాలనీ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు.
1988లో సార్క్ దేశాల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 1992లో సార్క్ వీసా మినహాయింపు పథకం (సార్క్ వీసా ఎగ్జెంప్షన్ స్కీమ్ – ఎస్‌విఇఎస్) మొదలైంది. ఆ పథకం ప్రకారం దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, న్యాయమూర్తులు, ఎంపీలు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు, క్రీడాకారులు ఆయా దేశాల్లో వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు.
08. పాకిస్తాన్ మిలటరీ సలహాదారుల బహిష్కరణ – దౌత్యపరమైన ఉద్రిక్తతలు:
ఏప్రిల్ 24న ఉన్నత స్థాయి భద్రతా సమావేశం తర్వాత న్యూఢిల్లీలోని పాకిస్తానీ హైకమిషన్‌లో ఉన్న సైనిక, నావికా, వైమానిక దళాల సలహాదారులను వారం రోజులలోగా భారత్ వదిలి వెళ్ళిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. వారిని ‘పెర్సోనా నాన్ గ్రేటా’గా ప్రకటించింది. అంటే వారు ఇంకెంత మాత్రం భారతదేశంలోకి రావడానికి వీల్లేదు. అదే సమయంలో పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో ఉన్న మన దేశపు సైనిక, నౌకాదళ, వైమానిక విభాగాల సలహాదారులను భారత ప్రభుత్వం వెనక్కు పిలిపించింది. ఆ ఉద్యోగాలను భారతదేశం అధికారికంగా రద్దు చేసింది. దానికి తోడు ఇరు దేశాల బృందాలలోనూ ఐదుగురు సపోర్ట్ స్టాఫ్‌ను కూడా ఉపసంహరించింది.
09. దౌత్య కార్యాలయాల పరిమాణం కుదింపు:
పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్‌లోని దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించాలని భారతదేశం నిర్ణయించింది. మే 1వ తేదీ నుంచి ఇస్లామాబాద్‌లో ఉన్న భారత దౌత్యవేత్తల మొత్తం సంఖ్య 55 నుంచి 30కి తగ్గించేసారు. ఇరు దేశాల మధ్యా ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం తీసుకుంటున్న చర్యల్లో ఈ చర్య కూడా ఒకటి.
10. ఉగ్రవాద అనుమానితుల ఇళ్ళ కూల్చివేత:
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కశ్మీర్‌లోని భద్రతా బలగాలు కనీసం 9 ఇళ్ళను కూల్చివేసాయి. ఆ ఇళ్ళు ఆ ప్రాంతంలో మిలిటెన్సీకి తోడ్పాటునందిస్తున్న వ్యక్తుల కుటుంబాలకు చెందినవి. మొదటగా లష్కర్ ఎ తయ్యబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ ఠోకర్ ఇంటి కూల్చివేతతో ఈ పని మొదలైంది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ఆదిల్ అహ్మద్ ఠోకర్కు ప్రమేయం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పుల్వామా, బందీపొరా, కుప్వారా వంటి ప్రాంతాల్లో ఉన్న మిగతా అనుమానితుల కుటుంబాలకు చెందిన ఇళ్ళను సైతం కూల్చివేసింది.
ఈ చర్యలతో పాకిస్తాన్ గుండెల్లో గుబులు తీవ్రమైంది. భారతదేశం ఏ క్షణాన ఎటువైపు నుంచి ఎలా యుద్ధం ప్రకటిస్తుందో అర్ధం కాక పాకిస్తాన్ ఇప్పటికే గజగజా వణికిపోతోంది. బైటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. భారత్ మాత్రం అనూహ్యమైన కోణాల్లోనుంచి తన చర్యలను ఒకటొకటిగా అమల్లోకి తీసుకొస్తూ పాకిస్తాన్ గుండెల్లో కాక రేపుతోంది.