పహల్గాం ఉగ్రదాడి తరవాత సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. యుద్ధం వస్తే దేశంలో ప్రజలు అనుసరించాల్సిన రక్షణ పద్దతులు వివరించేందుకు మే 7వ తేదీన దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అన్ని వర్గాలను యుద్ధ సన్నద్దత, రక్షణ చర్యలు వివరించేలా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, పోలీస్, హోం గార్డులు, విద్యార్థులను భాగస్వాములను చేస్తూ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.
ఉగ్రదాడికి దిగిన వారికి, వారికి సహకరించిన వారు కలలో కూడా ఊహించని దెబ్బ తీస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికల నేపథ్యంలో అజిత్ డోభాల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పాక్‌పై దాడికి సన్నద్దతపై ఇరువురు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడి తరవాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. సింధు జలాలను నిలిపివేయడం, ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిషేధం, పాకిస్థానీయులను దేశం వదలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడంతోపాటు, పోస్టల్, కొరియర్ సర్వీసులు కూడా నిలిపివేశారు.ప్రపంచ వేదికలపై భారత్‌పై అక్కసు వెళ్ల గక్కుతోన్న పాకిస్థాన్, ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అణుబూచిని చూపడం, క్షిపణి ప్రయోగాలు చేయడం పట్ల పలు దేశాలు పాకిస్థాన్ చర్యలను తప్పుపట్టాయి.