జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తరవాత దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి.తాజాగా పంజాబ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తోన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సహాయకుల సమాచారం అందుకున్న బలగాలు తనిఖీలు చేపట్టి, వారిని అరెస్ట్ చేశారు. బలగాల తనిఖీల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, ఐఈడీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లోని ఉగ్రవాద స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసేందుకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు.
ఇదిలా ఉండగా జమ్ము కశ్మీర్ బుద్గాం జిల్లాల్లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం అరెస్ట్ చేసింది.అనుమానాస్పదంగా తిరుగుతోన్న వ్యక్తులను తనిఖీ చేయగా ఉగ్రమూకలకు ఆయుధాలు సమకూరుస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి తుపాకులు, ఐఈడీ పేలుడు పదార్థాలు, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.