ద్రోణి, వాతావరణంలో అనిశ్చితి కారణంగా ఏపీలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బెంగాల్ నుంచి ఒడిషా మీదుగా ఏపీలో విస్తరించిన ద్రోణి ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమ ప్రాంతంలో పిడుగులు, ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంలో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండి తెలిపింది. పిడుగులు పడే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. పిడుగులు పడే సమయంలో ఎవరూ చెట్ల కిందకు వెళ్ల వద్దని అధికారులు సూచనలు చేశారు. పంటల నూర్పిడి చేస్తోన్న రైతులు వర్షాలకు దిగుబడులు తడవకుండా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బందిని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. గడచిన 48 గంటల్లో కురిసిన వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుపాటుకు ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. పంట నష్ట పోయిన రైతులకు 24 గంటల్లో పరిహారం చెల్లించాలని అధికారులను సీఎం ఆదేశించారు.