కర్ణాటకలోని మంగుళూరు నాలుగు రోజుల క్రితం హిందూ కార్యకర్త హత్యతో అట్టుడికిపోయింది. హతుడు సుహాస్ శెట్టి బజరంగ్ దళ్ మాజీ కార్యకర్త. సుహాస్‌ను నలుగురు ముస్లిములు నడిరోడ్డు మీద పొడిచి చంపేసారు.
సుహాస్ హత్య ఎలా జరిగింది?
మే 1, గురువారం మంగుళూరులోని బాజపే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం సుహాస్ శెట్టి గురువారం రాత్రి ఒక కారులో కొంతమంది స్నేహితులతో వెడుతున్నాడు. రాత్రి సుమారు 8.30 సమయంలో కినిపాడావు పెట్రోల్ పంప్ దగ్గర రెండు కార్లలో వచ్చిన నలుగురు దుండగులు సుహాస్ శెట్టి కారును అటకాయించారు. సుహాస్‌ను కారు నుంచి కిందకు దింపి తల్వార్లు, పదునైన కత్తులతో పొడిచేసారు. గాయాలతో రోడ్డు మీద పడిపోయిన సుహాస్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళినా ప్రయోజనం లేకపోయింది.
ఎవరీ సుహాస్ శెట్టి?
మంగుళూరు పరిసర ప్రాంతాల్లో హిందుత్వ వాదుల్లో ప్రముఖుడు సుహాస్ శెట్టి. అతను విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి సంస్థల్లో గతంలో క్రియాశీలంగా పనిచేసేవాడు. 2022లో సుహాస్ శెట్టి మీద ఒక ముస్లిం యువకుణ్ణి హత్య చేసిన కేసు మోపారు. ఆ కేసులోనే సుహాస్ ప్రస్తుతం బెయిల్ మీద బైట ఉన్నాడు.
కర్ణాటకలో హిందూ నాయకుల హత్యలు జరగడం ఇదేమీ మొదటి సారి కాదు. ఇంతకు ముందు దక్షిణ భారతదేశంలో చాలామంది హిందూ నాయకులను హత్య చేసారు. అతివాదులు లక్ష్యంగా చేసుకుని హతమార్చిన హిందూ నాయకుల వివరాలు సంక్షిప్తంగా చూద్దాం.
కర్ణాటకలో హతులైన కొందరు హిందూ నాయకులు….
1. బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు:
2022 జులై 26న బీజేపీ నాయకుడు ప్రవీణ్ నెట్టారును దక్షిణ కన్నడ జిల్లాలో ఇస్లామిక్ అతివాదులు హత్య చేసారు. రాత్రి తన దుకాణం మూసివేసి ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న ప్రవీణ్ నెట్టారును గొడ్డలితో నరికి చంపేసారు.
ప్రవీణ్ నెట్టారును చంపింది పిఎఫ్ఐ సంస్థకు చెందిన అతివాదులు. హిందువులను భయపెట్టడానికి, తమ నియంత్రణలో ఉంచుకోడానికీ పిఎఫ్ఐ ప్రవీణ్‌ను హతమార్చింది. ఇప్పుడు సుహాస్‌ను చంపిన తరహాలోనే ప్రవీణ్‌ను కొంతమంది ముస్లిం అతివాదులు చుట్టుముట్టి గొడ్డళ్ళతో దాడి చేసారు.
2. బీజేపీ నేత దీపక్ రావు:
2018 జనవరి 3న కర్ణాటక మంగుళూరులోని కటిపల్లా వద్ద బీజేపీ ఐటీ సెల్ సభ్యుడు దీపక్ రావును పట్టపగలే చంపేసారు. నలుగురు దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హతమార్చారు. దీపక్ రావు హత్య వెనుక పీఎఫ్ఐ, ఎస్డీపీఐ హస్తం ఉంది.
3. సంఘ్ కార్యకర్త శరత్ మదీవాలా:
2017 జులై 4న దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ తాలూకా బీసీ రోడ్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త శరత్ మదీవాలాను హత్య చేసారు. శరత్ తన లాండ్రీ షాపు కట్టేసి ఇంటికి వెడుతున్న సమయంలో అతని మీద దాడి చేసారు. తీవ్రంగా గాయపడిన శరత్, ఆస్పత్రిలో జులై 7న తుదిశ్వాస వదిలాడు. శరత్ హత్యకు సంబంధించి పిఎఫ్ఐ అతివాద ముస్లిం సంస్థకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసారు.
4. ఆర్ఎస్ఎస్ నాయకుడు రుద్రేశ్:
2016 అక్టోబర్ 16న బెంగళూరు శివాజీనగర్‌లో ఆర్ఎస్ఎస్ నాయకుడు ఆర్ రుద్రేశ్‌ను పట్టపగలే హత్య చేసారు. రుద్రేశ్ ఒక సంఘ కార్యక్రమం ముగించుకుని వెనక్కు వెడుతున్నారు. ఆ సమయంలో రెండు మోటార్‌సైకిళ్ళ మీద వచ్చిన దుండగులు పదునైన ఆయుధాలతో రుద్రేశ్ మీద దాడి చేసారు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఎన్ఐఏ దర్యాప్తులో రుద్రేశ్‌ను హత్య చేసింది పిఎఫ్ఐ దుండగులు అని తెలిసింది.
5. ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీ విష్ణువర్ధన్ శెట్టి:
2015 ఆగస్టు 15న శివమొగ్గ జిల్లాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త శ్రీవిష్ణువర్ధన్ శెట్టిని హత్య చేసారు. ఆ సమయంలో ముస్లిం అతివాద సంస్థ పిఎఫ్ఐ నిర్వహించిన ర్యాలీ కారణంగా ఆ ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగాయి. శ్రీవిష్ణువర్ధన్ శెట్టి హత్య పిఎఫ్ఐ కార్యకర్తలే చేసారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
కేరళ రాష్ట్రానికి చెందిన కేసులు కొన్ని….
1. బీజేపీ నాయకుడు శ్రీనివాసన్:
పాలక్కాడ్ నగరంలో 2022 ఏప్రిల్ 16న ఆర్ఎస్ఎస్ జిల్లా స్థాయి నాయకుడు ఎస్.కె శ్రీనివాసన్‌ను ఆయన మోటార్‌సైకిల్ షోరూంలోనే ఆరుగురు దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసారు. హంతకులు పిఎఫ్ఐ, ఎస్‌డిపిఐ సంస్థల కార్యకర్తలు అన్న ఆరోపణలు ఉన్నాయి.
2. బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్:
అలప్పుళ నగరంలో 2021 డిసెంబర్ 19న బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్ నివాసంలోకి కొంతమంది దుండగులు చొరబడి ఆయనను హత్య చేసారు. ఆ కేసుతో పిఎఫ్ఐ ప్రమేయానికి ఆధారాలు లభించాయి. కేసు విచారణ పూర్తయింది. 2024 జనవరి 31న అలెప్పి జిల్లా కోర్టు ఈ కేసుకు సంబంధించి పిఎఫ్ఐ, ఎస్‌డిపిఐ సంస్థలకు చెందిన 15మందికి మరణ శిక్ష విధించింది.
3. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎస్ సంజీత్:
పాలక్కాడ్ జిల్లా మంబ్రామ్ ప్రాంతంలో 2021 నవంబర్ 15న ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎస్ సంజీత్‌ను పట్టపగలే హత్య చేసారు. సంజీత్ తన భార్యతో కలిసి మోటార్ సైకిల్ మీద వెడుతుండగా కొందరు దుండగులు కారులో వెంబడించారు. సంజీత్ బైక్‌ను కారుతో ఢీకొట్టి వారిని నిలువరించారు. వెంటనే పదునైన ఆయుధాలతో సంజీత్ మీద దాడి చేసారు. తీవ్రంగా గాయపడిన సంజీత్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులు ఈ హత్యలో పిఎఫ్ఐ, ఎస్‌డిపిఐ కార్యకర్తల ప్రమేయం ఉందని నిర్ధారించారు.
4. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆనందరాజ్:
త్రిశూర్ జిల్లాలోని గురువాయూర్‌లో 2017 డిసెంబర్ 1న ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆనందరాజ్‌ను పట్టపగలే చంపేసారు. రాజకీయ కక్షల కారణంగానే ఆనందరాజ్‌ను హత్య చేసారని పోలీసులు నిర్ధారించారు. ఆనంద్ బైక్‌ను కారుతో ఢీకొట్టించి, పడిపోయిన ఆనంద్‌ను కత్తులతో పొడిచి చంపారు. ఆ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసారు. వారిలో ఒకరు సిపిఎం కార్యకర్త అని తేలింది.
5. ఎబివిపి నాయకుడు సచిన్ గోపాల్:
సచిన్ గోపాల్ కేరళలోని కన్నూరులో అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ఎబివిపి) ఉపాధ్యక్షుడుగా ఉండేవారు. 2012 జులై 6న పలిక్కున్ను ప్రాంతంలో సచిన్ గోపాల్ మీద దాడి జరిగింది. అప్పుడు సచిన్ గోపాల్ ఎబివిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం పలిక్కున్ను హైస్కూల్ దగ్గరకు వెడుతున్నారు. పిఎఫ్ఐ, దాని విద్యార్ధి విభాగం సిఎఫ్ఐ కార్యకర్తలు సచిన్ గోపాల్‌ను చాకుతో పొడిచారు. దానికి చికిత్స పొందుతూ సెప్టెంబర్ 5న సచిన్ గోపాల్ తుదిశ్వాస విడిచారు.
6. ఆర్ఎస్ఎస్ కార్యకర్త సి.వి రాఘవేంద్రన్:
కన్నూరు జిల్లాలో 2009 మే 2న ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త సి.వి రాఘవేంద్రన్‌ను దుండగులు హత్య చేసారు. ఒక రాజకీయ ర్యాలీలో పాల్గొని తిరిగి వెడుతుండగా రాఘవేంద్రన్ మీద దుండగులు దాడి చేసారు. పదునైన ఆయుధాలతో పొడిచేసారు. రాఘవేంద్రన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాఘవేంద్రన్‌ను హత్య చేసిన కేసులో పలువురు సిపిఎం కార్యకర్తలను నిందితులుగా గుర్తించి చార్జిషీట్ దాఖలు చేసారు. కానీ సరైన సాక్ష్యాలు లేక న్యాయస్థానం నిందితుల్లో ఎక్కువ మందిని విడిచిపెట్టేసింది. కేవలం కొద్దిమందిని మాత్రమే నేరస్తులుగా ప్రకటించి, వారికి శిక్ష విధించారు.
7. ఆర్ఎస్ఎస్ నాయకుడు అశ్విన్ కుమార్:
టి అశ్విన్ కుమార్ కన్నూరు జిల్లా ఆర్ఎస్ఎస్ బౌద్ధిక్ ప్రముఖ్, హిందూ ఐక్య వేదిక జిల్లా సమన్వయకర్తగా ఉండేవారు. 2005 మార్చి 10న ఆయనను కన్నూరు జిల్లాలోని ఇరిటీ దగ్గర హత్య చేసారు. ఆయన ఒక ప్రైవేటు బస్సులో వెడుతుండగా దుండగులు ఒక జీపులో వెంబడించారు. బస్సు ముందు నాటు బాంబులు వేసి ఆపారు. నలుగురు దుండగులు బస్సులోకి చొరబడి, పదునైన ఆయుధాలతో అశ్విన్ కుమార్‌ను పొడిచేసారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అశ్విన్ కుమార్ హత్యలో నేషనల్ డెవలప్మెంట్ ఫ్రంట్ (ఎన్‌డిఎఫ్)కు చెందిన 14మంది కార్యకర్తలను నిందితులుగా గుర్తించారు. ఎన్‌డిఎఫ్ తర్వాతి కాలంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)గా పేరు మార్చుకుంది. పిఎఫ్ఐని భారత ప్రభుత్వం నిషేధించింది, కానీ ఆ సంస్థకు చెందిన రాజకీయ పార్టీ ఎస్‌డిపిఐ క్రియాశీలంగా ఉంది. రాజకీయ పార్టీ ముసుగులో పిఎఫ్ఐ ఉగ్రవాదులు ఇప్పటికీ అరాచకాలకు పాల్పడుతూనే ఉన్నారు. 2024 నవంబర్‌లో తలస్సెరి జిల్లా కోర్టు ఈ కేసు నిందితుల్లో 13మందిని సాక్ష్యాలు లేని కారణంగా విడిచిపెట్టేసింది. ఒకే ఒక్క నిందితుడు ఎం.వి మార్షూక్ మీద నేరారోపణలు నిరూపణ అయ్యాయి. అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
తమిళనాడులో హిందూ నాయకుల హత్యలు….
1. హిందూ మున్నాని నాయకుడు సి శశి కుమార్:
హిందూ మున్నాని అధికార ప్రతినిధి సి శశికుమార్‌ను 2016 సెప్టెంబర్ 22న కోయంబత్తూరులో హత్య చేసారు. శశికుమార్ హంతకులు పిఎఫ్ఐ కార్యకర్తలే అని ఎన్ఐఎ విచారణలో తేలింది. శశికుమార్‌ను మోటార్‌సైకిల్ మీద వెంబడించిన ఇద్దరు దుండగులు పదునైన ఆయుధాలతో పొడిచి చంపేసారు. శశికుమార్ హత్యతో కోయంబత్తూరులో గొడవలు జరిగాయి.
2. హిందూ మున్నాని నాయకుడు కెపిఎస్ సురేష్ కుమార్:
కెపిఎస్ సురేష్ కుమార్ హిందూ మున్నాని తిరువళ్ళూరు జిల్లా కార్యదర్శిగా ఉండేవారు. ఆయనను 2014 జూన్ 18న చెన్నైలోని అంబత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ బస్ టెర్మినల్ చేరువలోని ఆయన దుకాణం దగ్గరే హత్య చేసారు. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ అల్ ఉమ్మా కార్యకర్తలే ఆ హత్యకు పాల్పడ్డారు.
3. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేత రమేష్:
వి రమేష్ బీజేపీ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి, ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులుగా పని చేసేవారు. 2013 జులై 19న సేలం నగరంలోని ఆయన ఇంటి దగ్గరే ఆయనను హత్య చేసారు. నలుగురు దుండగులు ఆయనను 17 సార్లు కత్తులతో పొడిచి చంపేసారు. ‘ముస్లిం డిఫెన్స్ ఫోర్స్’ అనే సంస్థకు చెందిన వారే హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు.
4. హిందూ మున్నాని నేత వెల్లయప్పన్:
ఎస్ వెల్లయప్పన్ హిందూ మున్నాని సంస్థ సీనియర్ నాయకుడు. ఆయనను 2013 జులై 1న వెల్లూరులో చంపేసారు. వెల్లయప్పన్ ఆ సమయంలో బైక్ మీద రామకృష్ణ మఠానికి వెడుతున్నారు. 8మంది దుండగుల గుంపు ఆయన మీద దాడి చేసింది. నిషిద్ధ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఉమ్మాకు చెందిన ఆ దుండగులు ఆయనను హత్య చేసారు.
ఇవి కేవలం కొన్ని సంఘటనలు, కొన్ని పేర్లు మాత్రమే. ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే… హిందూ నాయకులను హత్య చేసిన వారిలో ఎక్కువమంది ముస్లిం అతివాదులు. కేరళలో ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు హిందూ కార్యకర్తలను హతమార్చే వారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ముస్లిం అతివాదులు ఆక్రమించారు. అంతేకాదు… అతివాద ముస్లిం సంస్థ పిఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థ ఎస్‌డిపిఐ తమ కార్యకలాపాలను కేరళ నుంచి కర్ణాటక, తమిళనాడుకు బలంగా విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో కూడా వారి కార్యక్రమాలు వ్యాపిస్తున్నాయి. పిఎఫ్ఐని ఇప్పుడు నిషేధించినా ఎస్‌డిపిఐ రాజకీయ ముసుగులో చెలామణీ అయిపోతోంది. హిందూ సంఘటన కోసం కృషి చేసే నాయకులను భౌతికంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ముస్లిం సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని అర్ధమవుతోంది.