ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 మే 1న ఒక కేసులో తీర్పు ఇస్తూ షెడ్యూల్డు కులాల వారు క్రైస్తవంలోకి మతం మారితే వెంటనే ఎస్సీ హోదా కోల్పోతారన్న సంగతిని స్పష్టం చేసింది. ఆ తీర్పు మన సమాజంలో చాలా కాలంగా చర్చలో ఉన్న అంశాన్ని మరోసారి ప్రస్తావనకు తీసుకొచ్చింది. మతం మారినా ఆ విషయాన్ని దాచి ఎస్సీలుగా కొనసాగుతూ రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారు కోకొల్లలు. బైటకు దొరికితేనే దొంగలుగా తేలుతున్నారు. అంతవరకూ సమాజంలో దొరలుగా చెలామణీ అయిపోతున్నారు.
ఈ కేసును బట్టి మనం ఏం అర్ధం చేసుకోవాలి? ఇప్పటికీ పెద్దసంఖ్యలో క్రైస్తవులు తమకు ఎస్సీ రిజర్వేషన్ హక్కు కోసం రికార్డుల్లో హిందువులుగానే ఉంటున్నారు. ఇది పక్కా మోసమే. అంతే కాదు, ఆ రిజర్వేషన్ పేరిట హిందువుల మీద కేసులు పెడుతున్నారు. వాటిని సరిగ్గా తనిఖీ చేసే వ్యవస్థ లేకపోవడంతో విమతస్తులు సైతం హిందువులమంటూ రిజర్వేషన్లు పొందుతున్నారు. నిజమైన హిందూ ఎస్సీలకు ద్రోహం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో, మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవు అని న్యాయస్థానాలు తేల్చి చెప్పిన కొన్ని సంఘటనలను పరిశీలిద్దాం.
2025 మే 1: ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా:
ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో చందోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. తనను కులం పేరుతో దూషించారని, దాడి చేసి గాయపరిచారనీ ఆరోపించారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కొత్తపాలెం గ్రామానికి చెందిన ఎ రామిరెడ్డి, మరో ఐదుగురు వ్యక్తుల మీద కేసు నమోదు చేసారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నివారణ చట్టంలోని అంశాలతో కేసు కట్టారు. మరోవైపు నిందితులు ఆ కేసును కొట్టేయాలంటూ 2022లో హైకోర్టులో పిటిషన్ వేసారు.
ఆ సంఘటనపై ఏపీ హైకోర్టు తాజా విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది జె.వి ఫణిదత్ వాదిస్తూ ‘‘ఫిర్యాదిదారుడు గత పదేళ్ళుగా పాస్టర్‌గా చేస్తున్నారు. మతం మారిన వ్యక్తికి రిజర్వేషన్లు వర్తించవు. రాజ్యాంగం ప్రకారం హిందూ మతం కాకుండా ఇతర మతాలను స్వీకరిస్తే ఎస్సీ హోదా కోల్పోతారు. క్రైస్తవ మతం కుల వ్యవస్థను ప్రోత్సహించదు. ఆ మతస్తులకు ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద రక్షణ లభించదు. కాబట్టి కేసు కొట్టేయాలి’’ అని వాదించారు. పాస్టర్ ఆనంద్ తరఫు న్యాయవాది తన క్లయింట్ ఎస్సీయే అని తహసీల్దారు ఇచ్చిన ధ్రువపత్రాన్ని చూపారు. కానీ కోర్టు దానిని ఒప్పుకోలేదు. అది తప్పుడు కేసు అంటూ జస్టిస్ ఎన్ హరినాథ్ దాన్ని కొట్టేసారు.
2024 నవంబర్ 26: తమిళనాడు:
సెల్వరాణి అనే మహిళ తండ్రి హిందువు, తల్లి క్రైస్తవురాలు. తండ్రి వల్లువన్ అనే కులానికి చెందినవాడు. అది తమిళనాడులో ఎస్సీ కులం. అయితే అతను కూడా తర్వాత క్రైస్తవంలోకి మతం మారాడు. ఆ మేరకు డాక్యుమెంటరీ సాక్ష్యాలు ఉన్నాయి. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న తల్లిదండ్రులు, సెల్వరాణి పుట్టిన వెంటనే ఆమెకు బాప్టిజం ఇప్పించారు. సెల్వరాణి చిన్నతనం నుంచీ క్రమం తప్పకుండా చర్చ్‌కు వెళ్తుండేది.
2015లో పాండిచేరిలో అప్పర్ డివిజనల్ క్లర్క్ (యూడీసీ) ఉద్యోగం కోసం సెల్వరాణి ఎస్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమెకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ కేవలం ఉద్యోగం పొందడం కోసం ఎస్సీని అని చెప్పుకోడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. సెల్వరాణికి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వకూడదని తీర్పు ఇచ్చింది. మద్రాస్ హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ సెల్వరాణి సుప్రీంకోర్టుకెక్కింది. ఆ కేసులో జస్టిస్ పంకజ్ మిత్తల్, ఆర్ మహాదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2024 నవంబర్ 26న తుది తీర్పు ఇచ్చింది. ఒక మతాన్ని అనుసరిస్తూ, కేవలం రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం పొందడానికి ఎస్సీ సర్టిఫికెట్ కోసం వేరొక మతాన్ని అనుసరిస్తున్నాని చెప్పడం ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే’ అని తీవ్రంగా మండిపడింది. ఒక మతానికి చెందిన వ్యక్తి పూర్తిగా మరో మతం నియమాలు, సూత్రాలు, ఆధ్యాత్మిక భావజాలంతో ఏకీభవించి ఆ మతాన్ని అనుసరిస్తేనే మతం మారినట్లు పరిగణించాలి అని జస్టిస్ మహదేవన్ తెలియజేసారు. రెండో మతం మీద నిజానికి ఏమాత్రం నమ్మకం లేకుండా రిజర్వేషన్ లాభాలు పొందడం కోసం మాత్రమే మతం మారడాన్ని అనుమతించేది లేదని స్పష్టం చేసారు. రోజూ చర్చికి వెడుతూ, క్రైస్తవ మత పద్ధతులను పాటిస్తూ, ఉద్యోగం కోసం మాత్రం హిందూ ఎస్సీ సర్టిఫికెట్ కావాలని సెల్వరాణి కోరడాన్ని తప్పు పట్టారు.
2024 అక్టోబర్ 1: నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం వేములపాలెం గ్రామంలో తిరణం లక్ష్మణరావు అనే వ్యక్తి కుటుంబం క్రైస్తవంలోకి మతం మారారు. అంతకుముందు ఎస్సీ మాల కులానికి చెందిన లక్ష్మణరావు కుటుంబం, గ్రామంలో చర్చి నడపడం మొదలుపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చర్చి ఏర్పాటు చేయడమే కాక మతమార్పిడి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. దాంతో గ్రామస్తులు షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్‌కు ఫిర్యాదు చేసారు.
తమ గ్రామంలో రికార్డుల ప్రకారం క్రైస్తవులు ఎవరూ లేరని, తిరణం లక్ష్మణరావు అనే వ్యక్తి కొంతకాలంగా క్రైస్తవ మతం స్వీకరించి, రోజూ మైకులో మత ప్రచారం హోరెత్తిస్తున్నాడనీ, చుట్టుపక్కల గ్రామాల్లో సైతం అనధికారిక చర్చిలు నిర్వహిస్తున్నాడనీ ఆ ఫిర్యాదులో తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామంలో చర్చి పెట్టాలంటే జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి కావాలి. అలాంటిదేమీ లేకుండానే చుట్టుపక్కల గ్రామాలు సహా తమ గ్రామంలోనూ పలు చర్చిలు నడుపుతున్నాడని ఫిర్యాదు చేసారు.
గ్రామంలోని ఎస్సీ కులాలకు చెందిన వ్యక్తులు అందరూ కలిసి లక్ష్మణరావు మీద చాలాసార్లు తహసీల్దారుకు, గూడూరు మండల సర్కిల్ ఇనస్పెక్టర్‌కు, జిల్లా కలెక్టర్‌కూ పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని గ్రామస్తులు వాపోయారు. దాంతో జిల్లా కలెక్టర్ మొత్తం మీద ఆ వ్యవహారంపై విచారణ జరిపించారు. గూడూరు తహసీల్దారు జరిపిన విచారణలో గ్రామస్తులు చెప్పినవన్నీ నిజమే అని తేల్చారు. ఆ మ రకు 2023 డిసెంబర్లో జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీకి తహసీల్దారు నివేదిక సమర్పించారు. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్మణ రావు కుటుంబ సభ్యుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేసింది.
2023 నవంబర్ 17: శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్:
పి సుదర్శన్ బాబు అనే వ్యక్తి 2002లో శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో కంపేషనేట్ గ్రౌండ్స్ మీద రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. 2010లో సుదర్శన్ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని కెథెడ్రల్ పాస్ట్రొరేట్ చర్చిలో పెళ్ళి చేసుకున్నాడు.
విషయం తెలవడంతో అదని మీద లోకాయుక్తలో ఫిర్యాదు నమోదయింది. హిందూ ధార్మిక సంస్థలు, దేవదాయ శాఖ నియమ నిబంధనల ప్రకారం గుడులు, ధార్మిక సంస్థల్లో ఉద్యోగంలో చేరే వారు తప్పకుండా హిందువులే అయి ఉండాలి. కానీ తాను క్రైస్తవుడు అన్న సంగతిని దాచిపెట్టి సుదర్శన్ బాబు ఉద్యోగంలో చేరాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో అతన్ని ఉద్యోగంలోనుంచి తొలగించారు. ఆ నిర్ణయాన్ని సుదర్శన్ బాబు హైకోర్టులో సవాల్ చేసాడు. సర్టిఫికెట్ ప్రకారం తను హిందూ మాల కులస్తుడినని, తనకు ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుందనీ అతని వాదన. క్రైస్తవ యువతిని పెళ్ళి చేసుకున్నంత మాత్రాన తాను క్రైస్తవుడిగా మారిపోలేదంటూ సుదర్శన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించాడు.
కేసు విచారించిన హైకోర్టు బెంచి సుదర్శన్ వాదనను తప్పు పట్టింది. సుదర్శన్ విచారణాధికారికి తన వివాహ ధ్రువపత్రం సమర్పించలేదని గుర్తు చేసింది. నంద్యాల హోలీక్రాస్ కెథెడ్రల్లోని వివాహాల రిజిస్టర్లో సుదర్శన్, అతని భార్య వివరాలను పరిశీలించారు. అందులో సుదర్శన్ క్రైస్తవుడు అని నమోదు చేయబడి ఉంది. ఆ రిజిస్టర్లో సుదర్శన్ సంతకం కూడా చేసారు. ఆ పెళ్ళిని రెవరెండ్ జి.టి అబ్రహాం క్రైస్తవ పద్ధతిలో జరిపించారు. ఆ డాక్యుమెంట్లను బట్టి సుదర్శన్‌కు తను క్రైస్తవ విశ్వాసి అనే సంగతి తెలుసు అనీ, అతను క్రైస్తవుడిగానే పెళ్ళి చేసుకున్నాడనీ నిర్ధారణ అయింది. ఆ ఆధారాలతో సుదర్శన్ బాబును ఉద్యోగం నుంచి తొలగించడం సరైన నిర్ణయమే అని హైకోర్టు నిర్ధారించింది. లోకాయుక్త తీర్పును సమర్ధించింది.
2023 అక్టోబర్ 6: మదురై, తమిళనాడు:
మదురై జిల్లా అంబసముద్రం గ్రామానికి చెందిన టి అరుణ్ కుమార్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ముందు ఓ కేసు దాఖలు చేసారు. అంబసముద్రం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్పీ బలవీర్ సింగ్ తనను అక్రమంగా కస్టడీలో ఉంచారనీ, ఆ సమయంలో తనను చిత్రహింసల పాలు చేసారనీ, అరుణ్ ఆరోపణ. అందువల్ల ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం తనకు పరిహారం చెల్లించాలంటూ అతను కోరాడు. అయితే అతను మతం మారినందున ఎస్సీ లేదా ఎస్టీ కాదనీ, అతనికి పరిహారం చెల్లించనక్కరలేదనీ కోర్టు స్పష్టం చేసింది.
అరుణ్ కుమార్ క్రైస్తవుడనీ, అతను ఎస్సీ లేదా ఎస్టీ కులాలకు చెందిన వాడు కాదనీ అదనపు అడ్వొకేట్ జనరల్ తేల్చి చెప్పారు. అరుణ్ కుమార్ క్రైస్తవుడు కాబట్టి అతనికి హిందువుల రిజర్వేషన్లు వర్తించబోవని న్యాయమూర్తి స్పష్టం చేసారు.
2022, ఏప్రిల్ 8: అమరావతి, ఆంధ్రప్రదేశ్:
దారా మోహనరావు, ఆయన భార్య పుట్టుకతో హిందూ మాల కులస్తులు. అలాగే విద్యాభ్యాసం చేసారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్ గానూ, సెకెండరీ గ్రేడ్ టీచర్ గానూ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఉంటున్నారు. 2016లో వారు పొరుగువారిపై వేధింపుల కేసు పెట్టారు. ఆ సమయంలో వారు తమ పాత ఎస్సీ సర్టిఫికెట్లు దాఖలు చేసారు. కేసు విచారణ సందర్భంలో వారిద్దరూ క్రైస్తవ మతంలోకి మారారన్న సంగతి బైట పడింది. టీచర్లుగా ఉద్యోగాలు వచ్చిన తర్వాత సమాజంలో తమ స్థాయిని పెంచుకోవడం కోసం వారు క్రైస్తవంలోకి మారారు. హిందూ ఆచార వ్యవహారాలను మానివేసి క్రైస్తవ మత ఆచారాలను పాటించసాగారు. అందువల్ల వారు ఎస్సీ హోదాను కోల్పోయి, క్రైస్తవ మాల అంటే బీసీ సీ రిజర్వేషన్‌కు మాత్రం అర్హులయ్యారు. ఆ విషయాన్ని దాచిపెట్టి ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. విచారణ సందర్భంగా వారు క్రైస్తవులు అన్న విషయం బైటపడడంతో వారు పెట్టిన కేసు చెల్లబోదని హైకోర్టు తీర్పునిచ్చింది. హిందూ, సిఖ్ఖు, బౌద్ధ మతాలను అనుసరించే వారికి మాత్రమే వారి కులాన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుందని మరోసారి స్పష్టం చేసింది. ఈ కేసులో పిటిషనర్ల కుల ధ్రువీకరణ పత్రాలను ఎస్సీ నుంచి బీసీ సీ కేటగిరీకి మార్పించింది.
ఇలా… షెడ్యూల్డు కులాలకు చెందిన రిజర్వేషన్లను అనుభవిస్తున్న హిందువులు, సిక్కులు లేక బౌద్ధులు… వేరొక మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా పోతుంది అన్న సంగతిని న్యాయస్థానాలు పదేపదే తెలియజేస్తున్నాయి. క్రైస్తవంలోకి మతం మారడం వ్యక్తుల మతపరమైన స్వేచ్ఛ. కుల వ్యవస్థ లేని క్రైస్తవంలోకి మారిన తర్వాత కుల రిజర్వేషన్లను అనుభవించడం సరి కాదు. కేవలం రిజర్వేషన్ సౌకర్యాల కోసం, విద్యా ఉద్యోగ అవకాశాల కోసం మతాన్ని దాచిపెట్టుకుని ఎస్సీ హోదాను అనుభవించడం కుదరదని న్యాయస్థానాలు వివిధ తీర్పుల ద్వారా స్పష్టం చేస్తున్నాయి.