రాబోయే 48 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు వానగండం పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బెంగాల్ నుంచి ఒడిషా మేదుగా విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమ, మంగళ వారాల్లో తెలంగాణ, ఏపీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జల్లాల్లో భారీ వర్షాలు రాయలసీమలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే ప్రమాద ముందని ఐఎండి తెలిపింది.
గడచిన 24 గంటల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు తీవ్ర నష్టం మిగిల్చాయి. ఏపీలో భారీ వర్షాలు, పిడుగులు పడి ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. వందల కోట్ల విలులైన పంట నష్టం వాటిల్లింది. అరటి, మామిడి తోటలు ఈదురు గాలులకు నేలకొరిగాయి. వర్షాలకు రబీ ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
తెలంగాణలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. జగిత్యాల, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వాన తీవ్ర నష్టం కలుగజేసింది. మామిడి పంట రాలిపోయింది. మొక్కజొన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్ యార్డుల్లో కుప్పులు పోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది.