ఉగ్రమూకల కుట్రను నిఘా వర్గాలు పసిగట్టాయి. జమ్ముకశ్మీర్ జైళ్లోని ఉగ్రనాయకులను విడిపించుకునేందుకు ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ముందు జాగ్రత్తగా కోట్ బాల్వాల్, శ్రీనగర్ సెంట్రల్ జైల్, జమ్మూలోని ఇతర జైళ్ల వద్ద భద్రత పెంచారు. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఉగ్రమూకలకు సహకారం అందించే వర్కర్లను, స్లీపర్ సెల్స్‌ను అరెస్టు చేసి జైళ్లకు తరలించారు.
జమ్మూలో ఆర్మీ వాహనంపై దాడి నిందితులు నిస్సార్ ముష్తాక్, వారి సహచరులను ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది. జైళ్ల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. జమ్ము కాశ్మీర్ జైళ్లకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణ కల్పిస్తోంది.
తాజాగా బలగాలు జరిపిన కూంబింగ్‌లో ఉగ్రవాదుల శిబిరాలను గుర్తించారు. జమ్ము కాశ్మీర్ పూంచ్ సెక్టార్ సూరాన్ కోట్ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాలు గుర్తించారు. కమ్యూనికేషన్ పరికరాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.