ప్రముఖ యోగా గురువు శివానంద స్వామి కన్నుమూశారు. వారణాసిలోని ఆయన నివాసంలో కాసేపటి కిందట తుదిశ్వాస విడిచారు. యోగా గురువు శివానంద స్వామి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యోగాకు ఆయన చేసిన సేవలను ప్రధాని కొనియాడారు. శివానంద స్వామి మృతి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. దేశంలో ప్రతి రంగానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని సీఎం యోగి గుర్తుచేశారు.
1896 ఆగష్టు 8న అవిభాజ్య భారత్‌లోని సిల్హెత్‌లో ఓ నిరుపేద కుటుంబంలో శివానంద జన్మించారు. ఆరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. తరవాత ఆయన పశ్చిమబెంగాల్‌లోని ఓ ఆశ్రయంలో పెరిగారు. గురువు ఓంకారానంద గోస్వామి శివానందను పెంచి పెద్దచేశారు. యోగా విషయాలను నేర్పించారు. అప్పటి నుంచి శివానంద స్వామి జీవితాన్ని సమాజానికి అంకితం చేశారు. ఆరు దశాబ్దాల్లో 600 మంది కుష్ఠు రోగులకు శివానంద స్వామి సేవలు అందించారు.
యోగాలో శివానంద స్వామి కృషికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తో గౌరవించారు. తెల్లని ధోవతి, కుర్తా ధరించే శివానంద స్వామి ఏనాడూ కాళ్లకు చెప్పులు వేసుకోలేదు. ఢిల్లీలో పద్మాల ప్రధానోత్సవంలో అతి సామాన్యంగా వచ్చి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకుని వార్తల్లో నిలిచారు.