టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఇంట్లో దొంగలు పడ్డారు. కొవ్వూరులోని ఆయన నివాసంలో చోరీ జరిగింది. శనివారం రాత్రి ఆలస్యంగా ఈ విషయం గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్ నివాసం ఉంటున్నారు.అమరావతి రాజధాని పున:నిర్మాణ శంకుస్థాపన పనుల నేపథ్యంలో పది రోజులుగా జవహర్ విజయవాడలో ఉంటున్నారు. ఆయన భార్య ఉష, కుమారుడు, కుమార్తెలు తిరువూరు వెళ్లారు. శనివారం ఇంటి ఆవరణలో మొక్కలకు నీరు పోసేందుకు స్థానికంగా ఉండే వి. రాజు మాజీ మంత్రి జవహర్ నివాసానికి వెళ్లారు. అప్పటికే ఇంటి వెనుక తలుపులు తెరిచి ఉండటాన్ని ఆయన గమనించారు.
రాజు వెంటనే విషయాన్ని మాజీ మంత్రి జవహర్‌కు చెప్పారు. ఆయన డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ జి. దేవకుమార్, సిఐ పి. విశ్వం పరిశీలించారు.
జవహర్ కుటుంబ సభ్యులు రాత్రి పది గంటలకు ఇంటికి చేరుకున్నారు. మూడు బంగారు ఉంగరాలు, రూ.45 వేల నగదు, రూ.3 లక్షల విలువైన ఫోన్లు, వెండి వస్తువులు, టీవీ చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు.