పలు కేసుల్లో విజయవాడ జైల్లో రిమాండు ఖైదీగా ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అనారాగ్యానికి గురయ్యారు. శనివారం ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. 2డి, ఎకో, బీపీ, షుగర్, చాతీ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. బీపీలో హెచ్చుతగ్గుల మూలంగా కాళ్లలో వాపులు వచ్చాయని డాక్టర్లు గుర్తించారు. మూడు వారాల కిందట బీపీ మందులు మార్చడంతో ఇబ్బందులు తలెత్తినట్లు వైద్యులు తెలిపారు.
వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి డాక్టర్లు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయారు. తరవాత వారిని మరలా పిలిపించి వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. తీవ్రమైన ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారు. థైరాయిడ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు.
వల్లభనేని వంశీ అనుచరుడు రంగాను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విజయవాడ జైలుకు తరలించారు. మే1న రంగా అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా వైద్య సేవలు అందిస్తున్నారు. రంగా ఆరోగ్యం మెరుగు పడటంతో ఆయన్ను మరలా విజయవాడ జైలుకు తరలించారు.