శ్రీరామ జన్మభూమి అయోధ్యా నగరంలో ఆధ్యాత్మిక సంస్కృతిని పరిరక్షించడానికి అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో ఇటీవల నిర్మించిన భవ్య రామ మందిరానికి దారి తీసే 14 కిలోమీటర్ల పొడవైన మార్గం ‘రామ్ పథ్’లో మద్య మాంసాలు విక్రయాలపై నిషేధం విధించింది. ఇంకా ఆ ప్రాంతపు మతపరమైన స్వభావానికి తగని ప్రకటనలను సైతం ప్రదర్శించకూడదంటూ తీర్మానం చేసింది.
రామ పథం అనేది అయోధ్యలో ప్రధాన రహదారి. నేరుగా భవ్య రామ మందిరానికి తీసుకువెడుతుంది. అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం, మొత్తం 14 కిలోమీటర్ల రామ్ పథ్ పొడవునా 500 మీటర్ల వ్యాసార్ధం పరిధిలో మద్యం, మాంసం విక్రయించే దుకాణాలపై నిషేధం విధించారు. తద్వారా రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు పయనించే ఆ మార్గపు పవిత్రతను కాపాడేందుకు నిర్ణయించారు. ఈ నిర్ణయం మొత్తం రామ్ పథ్ మార్గం అంతటా అమలవుతుంది. ఆ దారిలో ఉన్న ఫైజాబాద్ సహా పలు ప్రాంతాల్లో సైతం నిషేధం వర్తిస్తుంది.
మద్యం, మాసం అమ్మకాలపై నిషేధంతో పాటు మునిసిపల్ కార్పొరేషన్ మరో నిర్ణయం కూడా తీసుకుంది. పాన్ మసాలా, గుట్కా, పొగాకు, సిగరెట్లు, చివరికి లోదుస్తుల వంటి ఇబ్బందికరమైన వస్తువుల ప్రకటనలను నగరంలోని బిల్‌బోర్డులు, హోర్డింగుల మీద ప్రదర్శించడం మీద కూడా నిషేధం విధించింది. ఈ చర్య వెనుక ప్రధానమైన ఉద్దేశం అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువును దర్శించుకోడానికి వచ్చే లక్షల మంది భక్తులకు ఆహ్లాదకరమైన, పవిత్రతతో కూడిన, గౌరవప్రదమైన యాత్రానుభవాన్ని కలిగించడమే అని అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఈ యేడాది రామ మందిర నిర్మాణం పూర్తిగా ముగుస్తుంది కాబట్టి ఇకపై ప్రతీయేటా భక్తులు పెద్ద సంఖ్యలో బాలరాముడి ఆలయాన్ని సందర్శించడానికి వస్తారని అంచనా.
తాజాగా జరిగిన అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదన ఉంచారు, దాన్ని ఆమోదించారు. ఆ సమావేశంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు 12మంది ఎన్నికైన కార్పొరేటర్లు కూడా ఉన్నారు. వారందరూ ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేసారు. ఆ తీర్మానం తర్వాత ప్రతిపాదనను అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ ఆబోదం కోసం పంపించారు.
ఆ సందర్భంగా అయోధ్య మేయర్ గిరీష్ పాటి త్రిపాఠీ మాట్లాడుతూ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదిగే స్థాయి అయోధ్యకు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకొన్నారని అభిప్రాయపడ్డారు. ‘‘అయోధ్య కేవలం ఒక పట్టణం కాదు., అయోధ్య భారతదేశపు సాంస్కృతిక, ఆధ్యాత్మిక అస్తిత్వానికి ప్రతీక. రామ్ పథ్‌కు మతపరంగా అమితమైన విలువ ఉంది. అటువంటి పవిత్రమైన రహదారి మీద మాంసాహారం, మద్యం విక్రయించడం తగని పని, దాన్ని నియంత్రించి తీరాల్సిందే’’ అని అన్నారు.
ఆ నిర్ణయానికి పలువురు మత గురువులు, స్థానిక ఆధ్యాత్మిక సంస్థలు, పెద్ద సంఖ్యలో అయోధ్య వాసులూ ఆమోదం తెలిపారని త్రిపాఠీ చెప్పుకొచ్చారు. అటువంటి చర్య అయోధ్యా నగరపు మత స్వభావాన్ని పరిరక్షిస్తుందని వారు విశ్వసించారు. ఇప్పటికే పట్టణంలోని ప్రధాన ఆలయాలు ఉన్న ప్రదేశాల్లో ఇటువంటి చర్యలు అమలవుతున్నాయి. వాటిని నగరం అంతటికీ విస్తరించవలసిందిగా స్థానిక భక్తులు చిరకాలం నుంచీ డిమాండ్ చేస్తున్నారని మేయర్ త్రిపాఠీ వివరించారు.
అయితే ఈ తీర్మానం కారణంగా కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆంక్షలు వర్తించబోయే ప్రాంతపు పరిధిలో ఉన్న కొందరు రెస్టారెంట్ యజమానులు, దుకాణదారులు తమ జీవనోపాధి మీద పడే ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నారు. తమ వ్యాపారాలు చేసుకోడానికి మరొక చోటు చూపించాలని లేదా ప్రత్యామ్నాయ వ్యాపార అవకాశాలు కల్పించాలనీ వారు కోరుతున్నారు.
మునిసిపల్ అధికారులు వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆంక్షల అమలు నిష్పాక్షికంగా, ఒక క్రమ పద్ధతిలో దశల వారీగా జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే వ్యాపారాలకు ప్రత్యామ్నాయ వాణిజ్య ప్రాంతాలను గుర్తించే అవకాశాల గురించి అన్వేషిస్తున్నారు. అలాగే, ఈ నిర్ణయం ప్రాధాన్యత గురించి, దాన్ని అమలు చేయబోయే పద్ధతి గురించీ స్థానిక ప్రజలు, వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం అయోధ్యను ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దడం, సాంస్కృతికంగా సుసంపన్నమైన అంతర్జాతీయ తీర్థయాత్రా స్థలంగా, ఘనమైన పుణ్యక్షేత్రంగా మలచడం అనే దీర్ఘకాలిక దృష్టితో కూడుకున్నది. రామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ తరుణంలో నగరంలో పర్యాటకం, ఆధ్యాత్మిక కార్యక్రమాలూ గణనీయంగా పెరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయోధ్య పౌరాణిక, ఆధ్యాత్మిక సంస్కృతిని ప్రతిబింబించేలా నగరాన్ని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కూడా ప్రయత్నిస్తున్నాయి.
అయోధ్య రామపథంలో మద్య మాంసాల విక్రయం మీద నిషేధం, కొన్ని రకాల ప్రకటనలపై నియంత్రణ ఈ మార్పుకు ప్రధమ సూచికలుగా నిలుస్తాయని భావిస్తున్నారు. చాలావరకూ స్థానిక ప్రజలు, పర్యాటకులూ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. రామ్‌పథ్‌లో ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత నెలకొనేలా చేయడానికి, నగరం అంతటా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రోత్సహించడానికీ అలాంటి చర్యలు అవసరమే అని వారు భావిస్తున్నారు.
అయోధ్యలోని ఆలయాల్లో ఉండే సాధుసంతులు, ధార్మిక విద్వాంసులు ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. భగవాన్ రాముడు ఆచరించిన విలువలను కొనసాగించడంగా వారు ఈ నిర్ణయాన్ని అభినందించారు. ‘‘రామ రాజ్యం అంటే కేవలం సుపరిపాలన మాత్రమే కాదు… ధర్మం, విలువలు, సంస్కృతి కూడా. ఆధ్యాత్మిక చైతన్యం నిండిన సమాజాన్ని నిర్మించడానికి ఇలాంటి చర్యలు ఎంతో అవసరం’’ అని హనుమాన్‌గఢీ ఆలయ పూజారి చెప్పుకొచ్చారు.
అయోధ్య నగర పాలక సంస్థ ఇప్పుడు ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేయడం మీద దృష్టి సారిస్తోంది. నిఘా వ్యవస్థలు, అమలు చేసే వ్యవస్థల ఏర్పాటు గురించి ప్రణాళికలు రచిస్తోంది. క్రమం తప్పకుండా ఇనస్పెక్షన్లు చేయడం, నోటీసులు జారీ చేయడం, ఉల్లంఘనలకు జరిమానాలు విధించడం వంటి చర్యలకు ఏర్పాట్లు చేస్తోంది. భవిష్యత్తులో అయోధ్యలోని ఇతర ప్రధాన మార్గాల్లో కూడా ఇలాంటి నియమావళిని అమలు చేసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.