భారత వాతావరణ శాఖ ఉత్తరాంధ్రకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని విజయనగరం,విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండి తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వాతావరణంలో అనిశ్చితి కారణంగా ఏపీ, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 24 గంటల్లో పిడుగులు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని అధికారులు హెచ్చరించారు. వ్యవసాయ పనులు చేసుకునే రైతులు, శ్రామికులు పిడుగులు, ఉరుములు సమయంలో చెట్ల కిందకు వెళ్లవద్దని అధికారులు సూచనలు చేశారు.