గోవాలోని శిర్గాయ్లోని లైరాయ్ దేవాలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. స్థానికంగా జరిగిన జాతరకు భక్తలు ఒక్కసారిగా పోటెత్తారు. భక్తులు ఒకేసారి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.భక్తుల తోపులాటతో మొదలై, తొక్కిసలాటకు దారితీసింది. ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాల కోల్పోయారు.
సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు గాయపడిన వారిని సమీపంలోకి ఆసుపత్రులకు తరలించారు. జాతర రద్దీ నివారణకు ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అందువల్లే దుర్ఘటన చోటుచేసుకుందని అనుమానిస్తున్నారు.
తొక్కిసలాటలో గాయపడిన వారిని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరామర్శించారు.ముఖ్యమంత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీసినట్లు చెప్పారు. బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.