కర్ణాటకలోని మంగళూరులో సుహాస్ శెట్టి (42) అనే వ్యక్తి హత్య తీవ్ర సంచలనానికి దారి తీసింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు గురువారం రాత్రి 8.27 గంటల సమయంలో సుహాస్ శెట్టి ప్రయాణిస్తున్న కారును అటకాయించి అతన్ని కత్తులు, ఇతర పదునైన ఆయుధాలతో పొడిచేసారు. పోలీసుల కథనం ప్రకారం సుహాస్ ప్రయాణిస్తున్న కారును కిన్నిపడవు ప్రాంతంలో రెండు కార్లు అడ్డుకున్నాయి. వాటిలో నుంచి ఐదారుగురు ఆగంతకులు దిగి సుహాస్‌ను బైటకు లాక్కొచ్చి పొడిచేసి పారిపోయారు. సుహాస్‌తో పాటు ఉన్నవారు అతన్ని సమీపంలోని ఏజే ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. తీవ్ర గాయాలతో సుహాస్ చనిపోయాడు. బాజ్పే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
సుహాస్ హిందూ సంస్థలతో సన్నిహితంగా పనిచేసేవాడు. గతంలో బజరంగ్‌దళ్‌లో క్రియాశీల కార్యకర్తగా ఉండేవాడు. అతనిపై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒకటి దక్షిణ కన్నడ జిల్లాలోనూ, మిగతా నాలుగూ మంగుళూరు నగరంలోనూ నమోదయ్యాయి. సుహాస్ పేరు రెండేళ్ళ క్రితం విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది. ముస్లిముల అరాచకాలను ప్రశ్నించడం దగ్గర మొదలైన కథ హత్యల దాకా చేరుకుంది.
సుహాస్ హత్య నేపథ్యం:
2022లో ఒక టీవీఛానెల్ చర్చాగోష్టిలో ముస్లిములు శివుణ్ణి అవమానిస్తూ వ్యాఖ్యలు చేసారు. దానికి ప్రతిగా బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, ఇస్లాం ప్రవక్త మహ్మద్ మైనర్ భార్య గురించి ప్రస్తావించారు. దాంతో దేశవ్యాప్తంగా ఆమెపై ముస్లిములు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసారు. ఆ క్రమంలో నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టును రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు చెందిన ఒక టైలర్ కన్హయ్యాలాల్ షేర్ చేసాడు. దాంతో ఇద్దరు ముస్లిం వ్యక్తులు కన్హయ్యాలాల్‌ను అతని టైలరింగ్ దుకాణంలోనే హత్య చేసారు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్హయ్యాలాల్ హత్యను నిరసిస్తూ కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భారతీయ జనతా యువ మోర్చా ప్రతినిధులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో పాల్గొన్న బీజేవైఎం కార్యకర్త ప్రవీణ్ నెత్తారును 2023 ఫిబ్రవరి 21న దక్షిణ కన్నడ జిల్లాలో హత్య చేసారు. ఆ హత్యలో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఫైజల్ (23) మరో రెండు రోజుల్లో హత్యకు గురయ్యాడు. ఫైజల్ హత్య కేసులో సుహాస్ శెట్టిని నిందితుడిగా చేర్చారు.
హిందూ సంస్థల మంగుళూరు బంద్:
2025 మే 1 రాత్రి సుహాస్ శెట్టి హత్యతో మంగుళూరు అట్టుడికిపోయింది. విశ్వహిందూ పరిషత్ సహా హిందూ సంఘాలు మే 2న మంగుళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం నిత్యకృత్యం అయిపోయింది. గతంలో సిద్దరామయ్య అధికారంలో ఉన్న మొదటిసారి 56మంది హిందూ కార్యకర్తలను హత్య చేసారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతీసారీ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు, పాకిస్తాన్ జెండాలు ఎగరేసే సంఘటనలు పెచ్చుమీరుతున్నాయి. అలాంటి పరిస్థితులే సుహాస్ హత్యకు కారణమయ్యాయి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి’’ అని మండిపడ్డారు.
ఆర్ అశోక్ మాట్లాడుతూ పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన వారిపై కాంగ్రెస్ సర్కారు ఎటువంటి కఠిన చర్యలూ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘దేశద్రోహులను కాల్చి పారేయడానికి కఠినమైన చట్టాలు ఉండాలి. సుహాస్ హత్య హిందూ కార్యకర్తలను తీవ్రంగా బాధించింది. ఇంకెంత మంది హిందువులను హత్య చేస్తారు? సుహాస్ శెట్టి హంతకులను రెచ్చగొట్టినది ఎవరు? పోలీసు విభాగం ప్రమేయం కూడా ఉందేమో దర్యాప్తు జరిపించాలి. రాష్ట్రంలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా దిగజారింది’’ అని ఆవేదన వ్యక్తం చేసారు.
సుహాస్ శెట్టి కారులో ఎలాంటి ఆయుధాలూ లేవు. అంటే అతనికి తనపై దాడి జరుగుతుందన్న అనుమానాలో, తాను ఎవరిపైన అయినా దాడి చేయాలనో ఉద్దేశాలో లేవు. కానీ అవతలి పక్షం మాత్రం సుహాస్‌ను చంపాలనే ముందస్తు కుట్రతో అతని ఆనుపానులు కనుక్కుంటూ ఉన్నారు. అతను ఎప్పుడు ఎక్కడికి వెడుతున్నాడో ట్రాక్ చేస్తూ అవకాశం దొరకగానే హత్య చేసారు. హిందూ ధర్మ విశ్వాసాలను రక్షించుకోడానికి ప్రయత్నాలు చేసే వారిపై అతివాదులు, రౌడీషీటర్లు అన్న ముద్రలు వేసి వారిని నేరస్తులుగా చిత్రీకరించి వారిని హత్యలు చేస్తున్నారు. అలాంటి దుండగుల మీద మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.
సుహాస్ హత్య నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు దయానంద్ గుండూరావు ఒక ప్రకటన చేసారు. బీజేపీ ఎలాంటి హింసాకాండనూ రెచ్చగొట్టకూడదు అని ఆయన పిలుపునిచ్చారు. దానిపై అశోక్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘పాకిస్తాన్ మనను అవమానించినా మేము నోరెత్తకూడదు. మన రాష్ట్రంలో పాక్ అనుకూల నినాదాలు చేసినా పోలీసులకు అది పెద్ద సమస్య కాదు. పోలీస్ వ్యవస్థ మొత్తం కాంగ్రెస్ పార్టీ జేబుసంస్థగా మారిపోయింది. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా మారిపోయాయి. వారు సరిగ్గా స్పందించడం లేనందునే సుహాస్ హత్య లాంటి సంఘటనలు జరుగుతున్నాయి’’ అంటూ మండిపడ్డారు.
సుహాస్‌ను హత్య చేసిందెవరు?:
సుహాస్ శెట్టి హత్యకు నిషిద్ధ ఉగ్రవాద సంస్థ పీఎఫ్ఐ, దాని అనుబంధ రాజకీయ సంస్థ ఎస్‌డిపిఐ కారణం అన్న అనుమానాలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఎమ్మెల్యే సీటీ రవి ప్రస్తావించారు. ఎస్‌డిపిఐ లాంటి అతివాద సంస్థలు మతోన్మాదాన్ని ప్రచారం చేస్తున్నాయని, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాయనీ ఆరోపించారు. దేశానికి ద్రోహం చేసే అలాంటి సంస్థలను క్షమించడం, సహించడం ఎంతమాత్రం కూడదన్నారు. పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసి అధికారంలోకి వచ్చిన వారిని నియంత్రించకపోతే భారతదేశపు సార్వభౌమత్వానికే సమస్య అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగారూ, ఎస్‌డిపిఐ, పిఎఫ్ఐ మీద ఉన్న కేసులను మీరు వాపసు తీసుకున్నారు. మీరు ఆ ద్రోహులకు అండగా నిలుస్తున్నారని గ్రహించారా? మీరు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దేశ సమైక్యతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దేశం వెలుపలి శత్రువులతో సమానంగా ఇలాంటి అంతర్గత శక్తులు కూడా ప్రమాదకరమే. వారి విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలి’’ అని పిలుపునిచ్చారు.
సుహాస్ శెట్టి తల్లి ఆవేదన:
సుహాస్ హత్యతో తల్లి సులోచన కన్నీళ్ళు ఆగడం లేదు. ‘‘సుహాస్ హిందుత్వం కోసం తన ప్రాణాలైనా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. ఇప్పుడు అవతలి పక్షం వాళ్ళు అతని జీవితాన్ని బలి తీసుకున్నారు’’ అంటూ వాపోయారు. ఇది సుహాస్ ఒక్కడి సమస్య కాదనీ, యావత్ హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్య అనీ సులోచన అన్నారు. హిందువులు భయాందోళనలతో జీవిస్తున్నారు. జనాభాలో 85శాతం ఉన్నప్పటికీ మనం భయభ్రాంతులకు లోనై బతకాల్సి వస్తోంది’’ అని ఆవేదన చెందారు.
సుహాస్ కుటుంబానికి బీజేపీ పరిహారం:
బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బివి విజయేంద్ర సుహాస్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. జాతి వ్యతిరేక శక్తులే సుహాస్‌ను అమానుషంగా హత్య చేసాయని మండిపడ్డారు. కశ్మీర్లో పహల్గామ్ దుర్ఘటన జరిగిన కొద్దిరోజులకే మంగుళూరు నగరంలో ఇలాంటి సంఘటన జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. పోలీసు వైఫల్యం కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హిందూ కార్యకర్తలకు ఎలాంటి రక్షణా లేదు. ఈ కష్టకాలంలో సుహాస్ కుటుంబానికి బీజేపీ అంతా అండగా నిలిచి ఉంది. సుహాసే కుటుంబానికి ఆధారం అని తెలిసింది. ఆ ఆధారమే కూలిపోయింది. బీజేపీ నేతలు, కార్యకర్తలూ ఈ కష్టకాలంలో సుహాస్ కుటుంబానికి అండగా ఉంటారు’’ అని విజయేంద్ర ప్రకటించారు.
సుహాస్ హత్య సంఘటన దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని విజయేంద్ర డిమాండ్ చేసారు. ఈ సంఘటన తీవ్రతను రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రీ అవగతం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి అని కోరారు. ప్రభుత్వం సుహాస్ హత్యపై దర్యాప్తు సవ్యంగా జరగనివ్వాలనీ, హతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలనీ డిమాండ్ చేసారు.
అమిత్ షాకు స్థానిక ఎంపీ లేఖ:
సుహాస్ శెట్టి హత్య తర్వాత దక్షిణ కన్నడ ఎంపీ కెప్టెన్ బ్రిజేష్ చౌతా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసారు. సుహాస్ అమానుష హత్య విచారణను స్థానిక పోలీసుల నుంచి తీసుకుని జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఆయన కోరారు. కర్ణాటక కోస్తా ప్రాంతంలో ఇస్లామిక్ ఛాందసవాదం, జాతి వ్యతిరేక శక్తులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. సుహాస్ హత్య కోస్తా ప్రాంతాన్ని మాత్రమే కాక యావత్ కర్ణాటక రాష్ట్రాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసాయంటూ ఆ లేఖలో రాసారు. మత సామరస్యాన్నీ, రాష్ట్రంలో భద్రతా వాతావరణాన్నీ ఇలాంటి సంఘటనలు దెబ్బ తీస్తున్నాయని ఆవేదన చెందారు.
గతంలో బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెత్తారును నిషిద్ధ ఉగ్రవాద సంస్థ పీఎఫ్‌ఐయే హత్య చేసిందన్న వాస్తవాన్ని ఎంపీ కెప్టెన్ బ్రిజేష్ చౌతా గుర్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే పీఎఫ్ఐ హింసాకాండ గురించి గతంలో ప్రస్తావించినా ఆ సంస్థ ఇంకా కొనసాగుతోందన్నారు. కర్ణాటక కోస్తా ప్రాంతంలో పిఎఫ్ఐ వంటి పేర్లతో అతివాద స్లీపర్ సెల్స్ కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. సుహాస్ హత్యతో పిఎఫ్ఐ వంటి సంస్థలు ఇంకా మనుగడలోనే ఉన్నాయనీ, హిందువులను చంపి పడేసే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయనీ ఆరోపించారు. ‘‘మరో హిందూ యువకుడు ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగించింది. పిఎఫ్ఐ వంటి సంస్థలు నేటికీ మనుగడ సాగిస్తున్నాయి, తమ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి’’ అన్నారు. సుహాస్ హత్య వెనుక పిఎఫ్ఐ ప్రమేయం ఉందన్న అనుమానాల నేపథ్యంలో విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించాల్సిందే అని డిమాండ్ చేసారు.