అమరావతి రాజధానికి రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలు ఇచ్చారని, గత ప్రభుత్వం వారిపై కక్షకట్టి కేసులు పెట్టి హింసకు గురిచేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. గత ప్రభుత్వ అరాచకాల వల్ల 2 వేల మంది అమరావతి రైతులు ప్రాణాలు కోల్పాయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని భవిష్యత్ ఆశల నగరంగా నిలుస్తుందని శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతుల త్యాగం ఫలిస్తుందన్నారు. ప్రధాని మోదీ అమరావతికి అండగా నిలుస్తున్నారని గుర్తుచేశారు.
అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగం ఊరికేపోదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. రైతులు భూమిని మాత్రమే కాదు, కోట్లాది మంది భవిష్యత్ రాజధానికి భరోసా ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం తుఫాను తరహాలో తీవ్రనష్టం చేసింది. భూమిలిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో వేగంగా పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం కనీసం మ్యాచింగ్ గ్రాంటులు కూడా ఇవ్వకపోవడంతో 95 పథకాలు నిలిచిపోయాయని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. అమరావతి రాజధానితోపాటు మొత్తం లక్షా 7 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్నారని పవన్ గుర్తుచేశారు.
అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగం ఊరికే పోదని విద్యామంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. పాక్ ఉగ్రమూకలు దేశంపై దాడి చేసి పెద్ద తప్పే చేశారని, ప్రపంచ పటంలో పాకిస్థాన్ లేకుండా పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34 వేల ఎకరాలు సేకరించి రికార్డు సృష్టించామని, ఈ ఘనత రాజధాని రైతులకే దక్కుతుందని మంత్రి నారాయణ అన్నారు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి నగరంలో అమరావతి నిలవబోతోందని నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.