కేరళలోని తిరువనంతపురం నియోజకవర్గం పరిధిలో విళింజం ఓడరేవును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. అదానీ సంస్థ రూపకల్పన చేసి, నిర్మించి, అభివృద్ధి చేసిన ఈ ఓడరేవు భారత దేశానికి సాగర వాణిజ్యంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ విళింజం ఓడరేవును మన దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ డీప్‌వాటర్ ఆల్-వెదర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్‌గా నిర్మించారు. ఇన్నాళ్ళు కొలంబో, సింగపూర్, దుబాయ్ వంటి విదేశీ ట్రాన్స్షిప్మెంట్ హబ్స్ మీద ఆధారపడిన భారతదేశానికి ఇప్పుడు ఆ సౌకర్యాలన్నీ విళింజం రేవు ద్వారా అందుబాటులోకి వచ్చాయి. విళింజం పోర్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేసారు. ఆ కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ ఓడరేవుల మంత్రి విఎన్ వాసవన్, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, నగర మేయర్ ఆర్యా రాజేంద్రన్, అదానీ పోర్ట్స్ లిమిటెడ్ యజమాని గౌతమ్ అదానీ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శశి థరూర్ పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అప్పుడే శశి థరూర్ వ్యక్తిగతంగా స్వాగతం పలికారు. దాని కోసమే శశి థరూర్ రాత్రికి రాత్రి ఢిల్లీ నుంచి తిరువనంతపురం చేరుకున్నారు. ఈ ఉదయం విళింజం ఓడరేవు ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేసే కార్యక్రమంలోనూ శశి థరూర్ ప్రధాని పక్కనే నిలిచారు. దానిపై ప్రధానమంత్రి సైతం చమత్కరించారు. ‘‘శశి థరూర్ ఇవాళ నా పక్కన ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమం కొంతమందికి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ సందేశం చేరవలసిన వారికి చేరిపోయింది’’ అని పరోక్షంగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు.
శశి థరూర్‌కు కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్ఠానంతో పొసగడం లేదన్న ఊహాగానాలు వస్తున్నాయి. కొన్ని నెలలుగా థరూర్ తమ పార్టీపై అసంతృప్తిని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. కొన్నాళ్ళ క్రితం ఒక కేంద్ర మంత్రితో శశి థరూర్ సెల్ఫీ తీసుకున్నారు. అప్పటినుంచీ ఆయన పార్టీ మారిపోతున్నారన్న ప్రచారం పుంజుకుంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో భారత దేశం తరఫున మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలను సైతం శశి థరూర్ సమర్ధించారు. భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. అప్పటినుంచీ శశి థరూర్ కాషాయ జెండా కప్పుకుంటారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.