వైశాఖ శుద్ధ పంచమి నాడు భారతదేశంలోని ఆలయాలు, మఠాలూ అన్నీ జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతిని వైభవంగా జరుపుకుంటాయి. భారతదేశ చరిత్రలో అత్యంత జాగృత మనస్కులు, ఆధ్యాత్మిక గిరి శిఖరంగా గౌరవాన్ని అందుకునే ఆదిశంకరులు పుట్టిన పర్వదినం ఇవాళ. విశ్వావసు నామ సంవత్సరంలో వైశాఖ శుక్ల ఏకాదశి, ఆంగ్ల తేదీల ప్రకారం 2025 మే 2వ తేదీన వచ్చింది. స్వయంగా శంకర భగవానుడి అవతారంగా హిందువులు భావించి పూజించే ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంత ప్రబోధకులు. ఇవాళ ఆయన 1237వ జయంతి.
ఆది శంకరులు కేరళలో పెరియార్ నదీ తీరంలోని చిన్న గ్రామం కాలడిలో సామాన్య శకం 788లో జన్మించారు. నిజానికి, ఆయన జన్మ సంవత్సరం మీద వివాదం ఉందన్న సంగతి వాస్తవం. శంకరాచార్యులు కనీసం మరో వెయ్యి సంవత్సరాల ముందు పుట్టి ఉంటారన్న ఆధారాలు ఉన్నప్పటికీ, పాశ్చాత్య పండితులు నిర్ధారణ చేసిన ప్రకారం సామాన్య శకం 788లోనే ఆయన జన్మించారని ప్రస్తుతానికి అందరూ విశ్వసిస్తున్నారు. శివగురువు, ఆర్యాంబ అనే కేరళ నంబూద్రి బ్రాహ్మణ దంపతులకు శంకరులు పుట్టారు. సంప్రదాయ కథనాల ప్రకారం శివగురువు, ఆర్యాంబ దంపతులకు చాలాకాలం పిల్లలు లేరు. పుత్ర సంతానం కోసం వారు శివుడికి తపస్సు చేయగా దైవ వరప్రసాదం వల్ల మగపిల్లవాడు పుట్టాడు. అతనికి శంకరుడు అని నామకరణం చేసారు. శంకరుడు అంటే ‘శుభాలను కలిగించే వాడు’ అని అర్ధం. భవిష్యత్తులో హిందూ ధర్మం విధిని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించేవాడిగా ఆయనకు ఆ పేరు సరిగ్గా సరిపోయింది.
శంకరులు బాల్యం నుంచే అసాధారణమైన ప్రతిభను కనబరిచేవారు. పిన్న వయసులోనే వేదాలు, ఉపనిషత్తులు, ఇతర సనాతన సాహిత్యాన్ని అధ్యయనం చేసారు. దురదృష్టవశాత్తు శంకరులు చాలా చిన్నవారిగా ఉన్నప్పుడే ఆయన తండ్రి శివగురువు కాలం చేసారు. తల్లి ఆర్యాంబ ఆయనను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది. ఎనిమిదేళ్ళ వయసులో శంకరులు సన్యాస మార్గాన్ని అవలంబించాలని నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఆ నిర్ణయానికి తల్లి ఆర్యాంబ అంగీకరించలేదు. ఒక కథ ప్రకారం శంకరులు ఒక అద్భుతం చేసి తన తల్లిని ఒప్పించారు. ఒక నదిని దాటుతుండగా ఒక మొసలి శంకరులను కాలితో పట్టుకుని లాక్కుపోయే ప్రయత్నం చేసిందనీ, అప్పుడు తల్లి అనుమతి తీసుకుని శంకరులు సన్యసిస్తున్నట్లు ప్రకటించారనీ, ఆ వెంటనే మొసలి ఆయన కాలిని వదిలేసిందనీ ఐతిహ్యం.
శంకరులు సన్యాసం ఎలా స్వీకరించారన్నది ప్రధానం కాదు. ఆ తర్వాత ఆయన చేసిన పనులన్నీ అద్భుతాలే. శంకరులు కౌమార దశలో ఉండగానే యావత్ భారతదేశాన్నీ కాలి నడకన చుట్టేసారు. దక్షిణాన రామేశ్వరం నుంచి ఉత్తరాన హిమాలయ పర్వతాల వరకూ ఆసేతు శీతాచలం పర్యటించారు. ఎందరో విద్వాంసులతో వాగ్వాదాలు చేసారు, ఎన్నో సిద్ధాంతాలను పూర్వపక్షం చేసారు. అప్పటికి ఆచారాలు, కర్మకాండలు, కుల వివక్ష, మూఢ విశ్వాసాలలో కూరుకుపోయిన సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు.
శంకరులు తన పదహారవ యేట తన గురువైన గోవిందపాదులను కలుసుకున్నారు. ఆచార్య గౌడపాదుల శిష్యులైన గోవిందపాదుల దగ్గర శంకరులు బ్రహ్మచర్య దీక్ష స్వీకరించారు. ఆ తరువాతి పదహారేళ్ళూ శంకరులు భారతీయ సంప్రదాయంలో అద్భుతమైన తాత్విక రచనలను చేసారు. వాటిలో ప్రధానమైనవి…
— బ్రహ్మసూత్ర భాష్యం : వేదాంత సూత్రాలకు భాష్యం
— మౌలికమైన పదకొండు ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు
— భగవద్గీతా భాష్యం : శ్రీకృష్ణుడి బోధనలకు అద్వైత వ్యాఖ్యానం
— ఉపదేశ సహస్రి : శంకరుల స్వతంత్ర తత్వబోధ
— నిర్వాణ షట్కం, సౌందర్య లహరి, శివానంద లహరి వంటి ఆధ్యాత్మిక స్తోత్ర సాహిత్యం
ఈ రచనలు వేదాలకు తార్కికమైన, సౌందర్యవంతమైన వ్యాఖ్యానాలు మాత్రమే కాదు, కుల వర్గ భేదం లేకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలనుకునేవారికి మార్గదర్శకాలు కూడా.
అద్వైత వేదాంతం: ‘అహం బ్రహ్మాస్మి – నేనే బ్రహ్మను’:
శంకరులు భారతజాతికి చేసిన విప్లవాత్మకమైన సేవ ఏంటంటే అద్వైత వేదాంతాన్ని స్థిరీకరించడం. శంకరుల ప్రకారం ఆత్మ (వ్యక్తి లేదా జీవాత్మ), బ్రహ్మ (అత్యున్నత సత్యం లేక పరమాత్మ) అనేవి విభిన్నమైనవి కావు. ఆ రెండూ ఒకటే. ‘అహం బ్రహ్మాస్మి – నేనే బ్రహ్మను’ అన్నదే శంకరుల బోధనలో కీలకమైన సిద్ధాంతం. దాన్నే అద్వైత సిద్ధాంతం అనే పేరుతో వ్యవహరిస్తారు.
శంకరాచార్యుల కాలం నాటికి సనాతన ధర్మంలో సంక్లిష్టమైన ఆచార వ్యవహారాలు, కర్మకాండలు, రీతి రివాజులు, జాతుల విభజనలు, నైతిక పతనం కారణంగా భారత ఉపఖండంలోని ఆధ్యాత్మిక వాతావరణం క్షీణదశలో సాగుతోంది. అలాంటి సమయంలో శంకరులు బోధించిన అద్వైత తత్వం సనాతనంలో స్పష్టతను, ఐక్యతను, తాత్విక గాఢతనూ తీసుకొచ్చింది. ప్రాంతం, భాష, జాతులకు అతీతంగా విశ్వ మానవాళికి అపూర్వమైన సందేశాన్ని అందించింది.
నాలుగు ఆమ్నాయ పీఠాలు:
ఆది శంకరాచార్యుల దార్శనికత గొప్పదనాన్ని చాటి చెప్పేవి ఆయన స్థాపించిన నాలుగు పీఠాలు. అద్వైత వేదాంత సంప్రదాయాన్ని వ్యవస్థీకృతం చేసి ప్రచారం చేయడానికి భారత దేశం నాలుగు దిక్కుల్లోనూ ఆయన నాలుగు ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేసారు.
— దక్షిణాన ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరీలో శారదా పీఠం
— తూర్పున ప్రస్తుత ఒడిషా రాష్ట్రంలోని పూరీలో గోవర్ధన పీఠం
— పశ్చిమాన ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో శారదా పీఠం
— ఉత్తరాన ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బదరీనాథ్‌లో జ్యోతిర్మఠం
ఈ చతురామ్నాయ పీఠాలూ కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే నిలవలేదు, దేశంలో సాంస్కృతిక సమైక్యతను సాధించడంలో ప్రధాన భూమిక పోషించాయి. నేటికీ ఆ నాలుగు పీఠాలలోనూ జగద్గురు శంకరాచార్యుల ఆధ్యాత్మిక వారసులుగా నియమించబడే వారిని శంకరాచార్యులుగానే గౌరవించడం సంప్రదాయంగా అనూచానంగా వస్తోంది.
ఆదిశంకరుల వారసత్వం తత్వశాస్త్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన కవిత్వ మహత్వం భక్తి సంప్రదాయానికి ఊపిరులు ఊదింది. శివుడు, విష్ణువు, పార్వతీదేవి, గణపతి తదితర దేవతా మూర్తుల మీద ఆయన రచించిన స్తోత్రాలు నేటికీ ఆలయాలలోనూ, గృహాలలోనూ అర్చనా సమయాల్లో ఆలపిస్తూనే ఉన్నారు. వాటి ఆధ్యాత్మిక గాఢత, కవిత్వ సౌందర్యం భక్తులను, సాహిత్య పిపాసువులనూ సమానంగా ఆకర్షిస్తూనే ఉన్నాయి. పార్వతీ దేవిని ఉద్దేశించి శంకరులు గానం చేసిన సౌందర్య లహరి భక్తి మార్గంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనూ అత్యుత్తమ రచనగా కీర్తి గడించింది.
ఆదిశంకరుల సంస్కరణ వాదం:
శంకరాచార్యులు గొప్ప సంస్కర్త కూడా. బాహ్యమైన ఆచార వ్యవహారాల కంటె మానసికమైన, ఆంతరంగికమైన స్వచ్ఛతకు ప్రాధాన్యమిచ్చారు. కుల విభేదాల కంటె విశ్వవ్యాప్తమైన పరమాత్మకు ప్రాధాన్యమిచ్చారు. అంధ విశ్వాసాల కంటె జ్ఞాన మార్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. భక్తుడికి మోక్షాన్ని ఇచ్చేందుకు జ్ఞాన, భక్తి, కర్మ మార్గాలు మూడూ ఉపయుక్తమే అని శంకరులు చాటి చెప్పారు. ఆ మూడింటినీ సమ్మిళితం చేస్తే ఆధ్యాత్మిక సమున్నతి సాధించగలమని ప్రకటించారు.
ఆదిశంకరులు తమ భౌతిక దేహాన్ని 32ఏళ్ళ వయసులో, అంటే సామాన్య శకం 820లో విడిచిపెట్టారని భావిస్తారు. ఆయన ఎక్కడ మహాసమాధి చెందారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. విస్తృత ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం ఉత్తరాఖండ్‌లో ఉన్న కేదారనాథ్ వద్ద ఆయన అంతర్థానమయ్యారట. కేదారనాథ్ దేవాలయం వెనుక ఉన్న పర్వత శ్రేణిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయిన శంకరులు ఆ తరువాత ఇంకెవరికీ కనిపించలేదని అంటారు. మరికొన్ని కథనాల ప్రకారం శంకరులు తమిళనాడులోని కాంచీపురంలో లేదా కేరళలో తన జన్మస్థానమైన కాలడిలో నిర్యాణం చెందారని భావిస్తారు. శంకరుల భౌతిక నిర్గమనం ఎక్కడ జరిగిందన్న చర్చను పక్కన పెడితే ఆయన ఆధ్యాత్మిక అస్తిత్వం శాశ్వతం, చిరంతనం.
శంకర జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉత్సవాలు జరుగుతున్నాయి. వేదమంత్ర ఉచ్చారణలతో పూజాదికాలు, శంకరుల జీవితమూ తాత్వికతలపై చర్చాగోష్ఠులు, మండనమిశ్రులతో శంకరుల తార్కిక సంవాదాల వంటి ఘట్టాల నాటక రూప ప్రదర్శనలూ, శంకరుల తాత్విక బోధనలను గౌరవించే ప్రపంచవ్యాప్త అద్వైతవాదులు నిర్వహించుకుంటున్న ఆన్లైన్ సెమినార్లూ శంకర జయంతిని చిరస్మరణీయంగా నిలుపుతున్నాయి. శృంగేరీ మఠంలో వారం రోజులుగా జరుగుతున్న శంకర జయంతి వేడుకలు ఇవాళ గురుపాదుకా పూజ, శంకర దిగ్విజయ పారాయణాలతో ముగుస్తాయి.
ఆధునిక ప్రపంచంలో ఆదిశంకరుల ప్రాసంగికత వంటి అంశాలపై దేశవ్యాప్తంగా ఎన్నో పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి అద్వైతం గురించి ఆయన సందేశం, స్వీయ అస్తిత్వాన్ని గుర్తించడం, ఆత్మతత్వ విచారణ వంటి చర్చలతో శంకరుల బోధలను స్మరించుకుంటున్నారు.