జనాభా లెక్కలతోపాటు కులగణన చేయడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందంటూ సీఎ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణ కులగణన రాంగ్ మోడల్ అన్నారు. ఎలాంటి శాస్త్రీయ పద్దతి లేకుండా కులగణన చేశామని చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కుల గణనకు తన ఇంటికి ఎవరూ రాలేదని గుర్తుచేశారు. తెలంగాణలో కనీసం 50 శాతం ఇళ్లకు ఎవరూ వెళ్ల లేదని అలాంటప్పుడు కులగణన ఎలా పూర్తి చేశారని ప్రశ్నించారు.
2010లోనే బీజేపీ కులగణనకు మద్దతు పలికిందని, ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో తెలియదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2011 జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టాలని బీజేపీ నేత సుష్మాస్వరాజ్, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. అయినా 2011లో కులగణన చేయలేదన్నారు. 1951 నుంచి ఇప్పటి వరకు కులగణన చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. మూడు రాష్ట్రాల్లో తుమ్మితే ఊడిపోయేలాంటి అధికారంతో కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కులగణన చేయడానికి 1948 జనగణన చట్టాన్ని సవరించాల్సి ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సవరణలు చేస్తామన్నారు. జనగణన, కులగణన 2026 తరవాత జరగవచ్చన్నారు. కులగణన తరవాత ముస్లింలను బీసీల్లో చేరుస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. మతం ఆధారంగా బీసీల్లో చేర్చడం జరగదన్నారు. 2026 జనాభా లెక్కల తరవాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్నారు.