ఎస్సీలు క్రైస్తవులుగా మారిన రోజే వారు ఆ హోదా కోల్పోతారని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. క్రిస్టియానిటీలోకి మారిన షెడ్యూల్డ్ కులాల వారు ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. ఓ చర్చి ఫాదర్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. చట్టాన్ని దుర్వినియోగం చేసి పలువురిపై కేసులు పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఓ కేసు విషయంలో విచారించిన హైకోర్టు పోలీసులు ఛార్జిషీట్ వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. కేసును కొట్టివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు.
కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన రామిరెడ్డి తనను కులం పేరుతో దూషించి గాయపరిచాడని పాస్టర్ చింతాడ ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. గుంటూరు ఎస్సీ,ఎస్టీ కోర్టులో మూడేళ్లుగా కేసు విచారణ జరుగుతోంది. క్రైస్తవంలోకి వెళ్లిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని, గతంలో పలు కేసులో
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రామిరెడ్డి తరపు న్యాయవాది కేసు కొట్టివేయాలంటూ వాదనలు వినిపించారు.
పాస్టర్ ఆనంద్ ఎస్సీ అంటూ తహశిల్దార్ ధ్రువపత్రం ఇచ్చారంటూ ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మసనం కేసును కొట్టివేసింది.