దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం అర్థరాత్రి భారీ వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. విపరీతమైన ఎండ వేడిమి నుంచి ఢిల్లీ వాసులకు కొంత ఉపశమనం లభించినా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్లు విరిగి రోడ్లపై పడటంతో రవాణాకు అంతరాయం కలిగింది. ముఖ్యంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 40కుపైగా విమానాలను దారిమళ్లించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణీకులకు పలు సూచనలు చేశారు.
ఢిల్లీలో 70 నుంచి 80 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.వాతావరణ శాఖ, ఢిల్లీ, గ్రేటర్ ఢిల్లీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
గత రాత్రి విరుచుకుపడిన ఈదురు గాలుల దెబ్బకు ఓ భారీ వృక్షం విరిగి ఓ ఇంటిపై పడింది. ఇంట్లో నిద్రిస్తోన్న తల్లి, ఆమె ముగ్గురు సంతానం ప్రాణాలు కోల్పోయారు. ద్వారకా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.