పహల్గామ్ ఉగ్రవాద దాడి మీద న్యాయ విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఆ సందర్భంగా పిటిషనర్ల మీద తీవ్రంగా విరుచుకు పడింది. సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని భావిస్తున్నారా అంటూ పిటిషనర్లను ప్రశ్నించింది.
ఫతేష్ కుమార్ షాహూ, మొహమ్మద్ జునెయిద్, విక్కీ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు పహల్గామ్ దాడిపై న్యాయ విచారణ కావాలంటూ పిటిషన్ దాఖలు చేసారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వారిపై మండిపడింది. ఉగ్రవాదంపై పోరు వంటి అంశాలను న్యాయ వ్యవస్థ ఎందుకు విచారణ చేయాలని నిలదీసింది. అలాంటి విషయాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిపుణులు ఎప్పటినుంచీ అయ్యారు? అని ప్రశ్నించింది.
ఆ కేసును విచారించిన జస్టిస్ సూర్యకాంత్ పిటిషనర్లపై చిరాకు పడ్డారు. ‘‘ప్రజాహిత వ్యాజ్యాల పేరిట ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసే ముందు బాధ్యతాయుతంగా వ్యవహరించండి. మీకు ఈ దేశం పట్ల బాధ్యత ఉందన్న సంగతి గుర్తెరిగి ప్రవర్తించండి. ఈ విధంగా మీరు మన సైనిక బలగాలను నైతికంగా బలహీనపరుద్దామని భావిస్తున్నారా? ఇలాంటి దర్యాప్తు విషయంలో మేము ఎప్పటినుంచీ నిపుణులం అయ్యాము?’’ అని ప్రశ్నించారు.
పిటిషనర్లు మాత్రం తమ వాదనను కొనసాగించారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో సామాన్య భారతీయ పౌరుల మీద దాడి చేసి 26మందిని చంపేసిన సంఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించే ఉగ్రవాదులు లేక దుండగులు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్ధులను లక్ష్యం చేసుకునే అవకాశం ఉందని, అటువంటి అమాయక కశ్మీరీ విద్యార్ధుల కోసమే ఆ పిటిషన్ దాఖలు చేసామనీ వారు వాదించారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి వ్యక్తం చేసిన ఆందోళన ప్రాతిపదికగా వారు ఈ వాదన తీసుకొచ్చారు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడి జరిగిన కొద్దిరోజులకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఇతర రాష్ట్రాల్లోని కశ్మీరీ విద్యార్ధుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసారు. ఆ విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం చేయడానికి తన మంత్రిమండలిలోని కొందరు మంత్రులను ప్రత్యేకంగా నియోగించారు.
ఆ వాదనను న్యాయస్థానం ఒప్పుకోలేదు. ప్రజాహిత వ్యాజ్యం పేరిట దాఖలు చేసిన పిటిషన్లో విద్యార్ధుల ప్రస్తావనే లేదని గుర్తు చేసింది. ‘‘ఇలాంటి పిటిషన్లకు ఇది సమయం కాదు. ఇది చాలా కీలకమైన సమయం. దేశంలోని ప్రతీ పౌరుడూ ఐకమత్యంగా ఉండాల్సిన తరుణం. (ఇలాంటి పిటిషన్) మాకు ఆమోదయోగ్యం కాదు. ఈ అంశం ఎంత సున్నితమైనదో గమనించండి’’ అంటూ పిటిషనర్లకు హితవు పలికింది. విద్యార్ధుల గురించి ఆందోళనగా ఉంటే మీరు హైకోర్టులను ఆశ్రయించవలసింది అని జస్టిస్ ఎన్‌కె సింగ్ స్పష్టం చేసారు.
పిటిషనర్లను తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్ధుల భద్రత గురించి హైకోర్టును ఆశ్రయించడానికి అనుమతి ఇచ్చింది. నిజానికి, ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఈ కేసు గురించి పిటిషనర్లకు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఇవ్వవద్దంటూ సుప్రీంకోర్టును కోరారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి:
2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో బైసరన్ లోయ దగ్గర పాకిస్తాన్ నుంచి చొరబడిన ముస్లిం ఉగ్రవాదులు పర్యాటకులను హిందువులు అవునా కాదా అని ప్రశ్నించి, నిర్ధారించుకుని కాల్చి చంపేసారు. నేపాల్‌కు చెందిన ఒక విదేశీయుడు, ఒక స్థానిక పోనీ రైడర్ సహా మొత్తం 26 మందిని పాయింట్ బ్లాంక్‌లో కాల్చి హత్య చేసారు. పాకిస్తాన్‌కు చెందిన నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ‘లష్కర్ ఎ తయ్యబా’ ప్రస్తుత ముసుగు అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ సంస్థ ఈ దాడి తామే చేసామని ప్రకటించింది. దాడి జరిగి ఎనిమిది రోజులు గడచిపోయినా ఇప్పటికీ ఆ దుండగులు పట్టుబడలేదు.
మృతుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన క్రైస్తవ పర్యాటకుడు, కశ్మీర్‌కే చెందిన ముస్లిం పోనీ రైడర్ తప్ప మిగతా 24మందీ హిందువులే. ముస్లిం ఉగ్రవాదులు హిందువులను పేరు అడిగి గుర్తించి, ప్యాంట్లు విప్పి సున్తీ అయిందో లేదో నిర్ధారణ చేసుకుని మరీ కాల్చి చంపారు. ముస్లిం ఉగ్రవాదుల కోసం భారీ అన్వేషణ కొనసాగుతోంది. భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, సరిహద్దు భద్రతా దళాలు, నిఘా ఏజెన్సీలు కలిసి పని చేస్తున్నాయి. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేసారు.
ఈ దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తన దర్యాప్తు ప్రారంభించింది. అసలు దాడి ఎలా జరిగింది, భద్రతా వైఫల్యం ఏమైనా ఉందా వంటి అంశాలను ఆ సంస్థ పరిశోధిస్తోంది.
ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు 20మంది స్థానికులు – ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ – సహాయపడ్డారని ఎన్ఐఏ గుర్తించింది. వారిలో పలువురిని అరెస్ట్ చేసింది, మిగిలిన వారిని అన్వేషిస్తోంది. ఇప్పటివరకూ 2500 మందికి పైగా జనాలను ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్ అంతటా నిషిద్ధ సంస్థల కార్యాలయాలు, వాటి సభ్యులూ సానుభూతిపరులు దాగి ఉండే అవకాశం ఉన్న (హైడ్ఔట్స్) ప్రదేశాలను జల్లెడ పట్టి సోదాలు చేసారు.
దుష్టులు ఎప్పటికీ విజయం సాధించలేరు: ప్రధాని ప్రతిజ్ఞ
ఒక నేపాలీ జాతీయుడు సహా 26మంది అమాయక ప్రజల ప్రాణాలను హరించిన ముస్లిం ఉగ్రవాదుల మీద ప్రతీకారం తీర్చుకుంటామని ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసింది. అలాగే ఉగ్రదాడికి ప్రణాళిక రచించిన వారిని, వారికి సహకరించిన వారిని కూడా వదిలిపెట్టబోమని భారతదేశం వాగ్దానం చేసింది.
ఉగ్రవాదపు దుష్ట అజెండా ఎప్పటికీ గెలవజాలదని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వం ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూల ఉన్నా వారిని పట్టుకుని తీరుతుందని, బాధితులకు న్యాయం చేస్తుందనీ హెచ్చరించారు.
అదే సమయంలో భారత ప్రభుత్వం, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నందుకు పాకిస్తాన్‌ను కూడా తీవ్రంగా ఖండించింది. ఏప్రిల్ 29 మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్‌లతో సమావేశం అయ్యారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోడానికి సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.
ఇదే సమయంలో, భారత సరిహద్దుల దగ్గర పాకిస్తాన్ కాల్పులకు పాల్పడుతోంది. ఏప్రిల్ 22 నుంచీ ప్రతీక్షణం ఉద్రిక్తంగా మారిన పాకిస్తాన్, తన గాంభీర్యాన్ని ప్రకటించుకోవడం కోసం సరిహద్దుల దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతీరోజూ ఉల్లంఘిస్తూనే ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి వరుసగా ఏడు రాత్రుల నుంచీ చిన్నా చితకా కాల్పులు జరుపుతూనే ఉంది.