భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. అమృత్సర్ సమీపంలో బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఆయుధాలు పట్టుబడ్డాయి. వాటిలో తుపాకులు, గ్రనేడ్లు ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ సరిహద్దు ప్రాంతంలో పెద్దమొత్తంలో ఆయుధాలు పట్టుబడటం కలకలం రేపుతోంది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిఘా విభాగం సమాచారం మేరకు ఏప్రిల్ 30 సాయంత్రం ఆ ఆపరేషన్ నిర్వహించారు. దానిలో భాగంగా ఆయుధాలను గుర్తించారు. రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, మూడు పిస్టళ్ళు, ఆరు మ్యాగజైన్లు, 50 లైవ్ రౌండ్ల బులెట్లు పట్టుబడ్డాయి. మందుగుండ్లను, పేలుడు పదార్ధాలనూ స్వాధీనం చేసుకొన్న బీఎస్ఎఫ్ జవాన్లు వాటిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు. దీనిపై తదుపరి దర్యాప్తు జరగనుంది. బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు అత్యంత వేగవంతంగా, సమన్వయంతో వ్యవహరించడంతో ఈ ఉగ్ర కుట్ర భగ్నమైంది.
మరోవైపు… బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనూ పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ కలకలం సృష్టించిందని తెలుస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనుస్ అధికారంలోకి వచ్చాక.. ఇరుదేశాల సంబంధాలు బలోపేతం అయ్యాయి. దాంతో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, మిలిటరీ అధికారులు బంగ్లాదేశ్‌లోని భారత్ సరిహద్దుల వైపు రావడం పెరిగింది. బంగ్లాదేశ్‌లోని అతివాద గ్రూపులతోనూ ఐఎస్ఐ సంబంధాలు పెంచుకుంటోంది. భారతదేశానికి వ్యతిరేకంగా ఆ గ్రూపులను పాకిస్తాన్ వాడుకునే అవకాశాలున్నాయని భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లోని పోస్టుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేసాయి.