దేశంలో జనాభా లెక్కల్లో భాగంగా కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. కుల గణన కావాలని కోరుతూ రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసారనీ, అందువల్ల ఈ విషయంలో మొదటి అభినందనలు ఆయనకే చెప్పాలనీ రేవంత్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో ఈ విషయమై రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కులగణన కోసం కేంద్రమంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కుల గణన విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఆ విషయంలో తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుందని సలహా ఇచ్చారు. కులగణన కోసం తెలంగాణ నమూనాను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. అన్ని రాష్ట్రాలకు నిపుణుల కమిటీని పంపించాలని సూచించిన రేవంత్ రెడ్డి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు తీసుకోవాలన్నారు. కుల గణన విషయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ఒకో రాష్ట్రంలో ఒకో కులం ఒకో వర్గంలో ఉందని, అలాంటి వాటిని గుర్తించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలనీ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.