ఉపాధి హామీ పథకం రాష్ట్రానికి, దేశానికి వరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మే డే సందర్భంగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన శ్రామికుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం రాష్ట్రానికి దేశానికి వరమన్నారు. ఏపీలో 75 లక్షల మంది శ్రామికులు వంద రోజులు ఉపాధి పొందుతున్నారని ఆయన కొనియాడారు.గత ఏడాది ఉపాధి హామీ పథకం కింద రూ.10669 కోట్లు ఖర్చు చేయగా అందులో సగం శ్రామికులకు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. మరో రూ.4 వేల కోట్లు మెటీరియల్ ఖర్చు అయిందన్నారు.
పల్లె పండుగలో రూ.377 కోట్లు ఖర్చు చేసి 21 వేలకుపైగా గోకులాలు పూర్తి చేసినట్లు పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. దీని వల్ల ప్రతి రైతుకు నెలకు రూ.4 వేలకుపైగా ఆదాయం లభిస్తుందన్నారు. ఉపాధి హామీ కూలీలను ఇక నుంచి శ్రామికులుగా పిలుద్దామని చెప్పారు.
ఉపాధి హామీ శ్రామికులు కూడా గొప్పవారేనన్నారు. గత ప్రభుత్వం మద్య నిషేధం పేరు చెప్పి, రూ. 1200 కోట్లు కొల్లగొట్టారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు అప్పుల పాలు చేసిన సమయంలో, ఉపాధి హామీ నిధులు రాష్ట్రాన్ని ఆదుకుంటున్నాయన్నారు.
ఉపాధి హామీ కూలీలు పని ప్రదేశంలో ప్రమాదవశాత్తూ మరణిస్తే వారికి రూ.2 లక్షల పరిహారం కింద బీమా ఇస్తున్నామన్నారు. గతంలో ఇది రూ.50 వేలు మాత్రమేనని గుర్తుచేశారు. ఇందుకు సంబంధించి శ్రామికులకు బీమా అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు.