కేదారనాథ్ దేవాలయం ద్వారాలు రేపటి నుంచి భక్తుల కోసం తెరచుకోనున్నాయి. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కేదారనాథ్ ఆలయాన్ని 13క్వింటాళ్ళ పూలతో అలంకరించారు. బాబా కేదారనాథ్ మూర్తి ఆలయానికి ఇవాళ చేరుకుంటుంది. రేపు ఉదయం 7 గంటలకు ఆలయ ద్వారాలు తెరుస్తారు.
గంగోత్రి, యమునోత్రి క్షేత్రాల్లో ద్వారాలను అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 30న తెరిచారు. వేద మంత్రాలు వల్లిస్తూ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో చార్ధామ్ యాత్ర అధికారికంగా మొదలైంది. ఆ సందర్భంగా గంగోత్రి ధామ్‌ను, యమునోత్రి మందిరాన్ని దర్శించిన భక్తుల మీద పుష్పవృష్టి కురిపించారు.
గంగోత్రి, యమునోత్రి క్షేత్రాల్లో కపాటోద్ఘాటన (ద్వారాలు తెరిచే) కార్యక్రమాలు జరిగాయి. యమునోత్రి దగ్గర కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పాల్గొన్నారు. రెండు చోట్లా మొదటి పూజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరిట జరిగాయి. చార్ధామ్ యాత్ర ప్రశాంతంగా సాగాలని, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలనీ కోరుతూ పుష్కర్ సింగ్ ధామీ కోరుకున్నారు. యమునోత్రి ధామ్ దగ్గర కపాటోద్ఘాటన కార్యక్రమంలో పాల్గొన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీయే కావడం విశేషం.
స్థానిక ధార్మిక సంప్రదాయాల ప్రకారం ఏప్రిల్ 30 ఉదయం భైరవ లోయలోని భైరవ మందిరం నుంచి గంగా మాత ఊరేగింపు పల్లకీ గంగోత్రి చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలూ చేసిన తర్వాత భక్తుల కోసం గుడిని ఉదయం 10.30కు తెరిచారు. అలాగే యమునా మాత పల్లకీని అమ్మవారి శీతాకాలపు విడిది అయిన ఖార్సలీ నుంచి యమునోత్రి ధామ్‌కు ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. అక్కడ పూజాదికాల తర్వాత 11.55కు భక్తుల కోసం ఆలయ ద్వారాలను తెరిచారు. గంగోత్రి, యమునోత్రి క్షేత్రాల్లో ద్వారాలు తెరిచే కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి వేలాది భక్తులు హాజరయ్యారు. గంగా యమునా నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. అమ్మవారి దర్శనం, అఖండ జ్యోతి దర్శనం చేసుకున్నారు.
ఆ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మాట్లాడుతూ చార్ధామ్ యాత్ర సురక్షితంగా, సౌకర్యవంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లూ చేసామని చెప్పుకొచ్చారు. భక్తులకు కావలసిన మౌలిక వసతులను అందుబాటులో ఉంచామని, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసామనీ చెప్పారు. యాత్రను పవిత్రంగా, పర్యావరణ హితంగా పూర్తి చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేసారు.