జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న 26మంది హిందువులను హతమార్చిన ముస్లిం ఉగ్రవాదులు అంతకు రెండు రోజుల ముందే బైసరన్ లోయ ప్రాంతానికి చేరుకున్నారు. నిజానికి వారం రోజుల కంటె ముందే భారత్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు మరో మూడు ప్రదేశాల్లో కూడా రెక్కీ నిర్వహించారు. ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ అరెస్టు చేసిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ విచారణలో ఆ విషయం బైటపడింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఉగ్రవాదులు పహల్గామ్కు ఏప్రిల్ 15కే చేరుకున్నారు. బైసరన్ లోయతో పాటు మరో మూడు ప్రాంతాల్లోనూ వారు రెక్కీ నిర్వహించారు. స్థానికంగా ఉన్న అరూ లోయ, బేతాబ్ లోయ, మరో ఎమ్యూజ్మెంట్ పార్కును కూడా వారు పరిశీలించారు. పర్యాటకులను హతమార్చడానికి సులువైన ప్రదేశం ఏది అన్న కోణంలో వారు రెక్కీ చేపట్టారు. ఆ మూడు ప్రాంతాల్లోనూ భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నందున అక్కడ పర్యాటకులను చంపడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ఉగ్రవాదులు వెనుకడుగు వేసారని తెలుస్తోంది.
పొరుగునున్న శత్రుదేశం నుంచి వచ్చిన ఉగ్రవాదులకు కనీసం 20 మంది స్థానికులు సహాయ సహకారాలు అందజేసారని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కనుగొంది. వారిలో పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తోంది. మిగతా వారిపై నిఘా కొనసాగుతోంది.
ఇంటలిజెన్స్ సమాచారం ప్రకారం విదేశీ ఉగ్రవాదులకు కనీసం నలుగురు స్థానికులు కీలక సహాయం అందజేసారు. ఉగ్రవాదులకు రవాణా సదుపాయాలు కల్పించడంలోనూ, ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించడంలోనూ ఆ స్థానికులే ప్రముఖ పాత్ర వహించారు. దాడికి ముందు ఉగ్రవాదులు మూడు శాటిలైట్ ఫోన్లను సైతం వినియోగించారని తెలిసింది. వాటిలో రెండు శాటిలైట్ ఫోన్ల సిగ్నల్స్ జాడలను విజయవంతంగా గ్రహించగలిగారు.
పహల్గామ్ దాడికి సంబంధించి ఎన్ఐఏ, ఇతర నిఘా విభాగ సంస్థలు ఇప్పటివరకూ 25వందల మందికి పైగా వ్యక్తులను విచారణ జరిపాయి. వారిలో 186మందిని అదుపులోకి తీసుకున్నాయి. వారిని మరింత వివరంగా ప్రశ్నించడానికి సిద్ధపడుతున్నాయి.
పహల్గామ్ దాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్లో పక్కా సమన్వయంతో సోదాలు నిర్వహించాయి. నిషిద్ధ సంస్థల్లో కార్యకర్తలు, వారికి సానుభూతిపరులుగా ఉన్నవారి ఇళ్ళను పూర్తిగా తనిఖీ చేసారు. కుప్వారా, హంద్వారా, అనంతనాగ్, త్రాల్, పుల్వామా, సోపోర్, బారాముల్లా, బందీపొరా వంటి ప్రాంతాలను జల్లెడ పట్టారు. జమాతే ఇస్లామీ, హురియత్ కాన్ఫరెన్స్ వంటి సంస్థల చీలిక విభాగాలకు చెందిన ప్రతీ ఒక్కరి ఇంటినీ సోదా చేసారు. ఆయా సంస్థలు నేరుగా కాకపోయినా పాకిస్తానీ ఉగ్రవాదులకు అవసరమైన సపోర్ట్ నెట్వర్క్ను తయారు చేసిపెట్టి ఉంచాయని సమాచారం.
ఆయా ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తుల కాల్ రికార్డ్లను ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తున్నారు. వారికి, పహల్గామ్లో దాడులకు సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్లకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు.