తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో బిజాపుర్ జిల్లాలోని కర్రె గుట్టల్లో మావోయిస్టుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ పదో రోజుకు చేరుకుంది. దాదాపు 5 వేల అడుగుల ఎత్తులో సుమారు 100 కిలోమీటర్ల పొడవున ఉన్న ఉన్న కర్రెగుట్టల్లో రెండు కొండలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
తొలుత నీలం సరాయ్ కొండను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు, బుధవారం నాడు ‘దోబే’ కొండలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ల సాయంతో బలగాలను దించారు. అక్కణ్ణుంచి మరో ముఖ్యమైన మూడో కొండ వైపు చేరుకునేందుకు వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్నాయి. కర్రె గుట్టలపై భారత జవాన్లు జాతీయ జెండాను రెపరెపలాడించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. భద్రతా బలగాలు ఇప్పటివరకు ఆ ప్రాంతాల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన 150కి పైగా అత్యాధునిక పేలుడు పదార్ధాలను నిర్వీర్యం చేసాయి.
మావోయిస్టులు ఎక్కడ?
మరోవైపు, భద్రతా బలగాలకు మావోయిస్టులు దొరక్కుండా పారిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపుర్ జిల్లా మధ్యలో ఉన్న అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్‌ఛార్జి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ బృందం అక్కడ దాగి ఉన్నారనే సమాచారంతో భారీ స్థాయిలో కూంబింగ్ చేపట్టినా… వారు దొరకడం లేదు. భద్రతా బలగాల ప్రయత్నాలను ముందుగానే పసిగట్టి, మావోయిస్టులు కర్రె గుట్టలను వదిలి మరో చోటకు తప్పించుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
’’శాంతిచర్చల ప్రసక్తే లేదు‘‘
కర్రె గుట్టల ఆపరేషన్‌ను నిలిపివేయాలని కోరుతూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ‘అభయ్’… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల శాంతి చర్చలు జరపాలంటూ విజ్ఞప్తి చేశారు. దానికి ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ స్పందించారు. శాంతి చర్చల ప్రసక్తే లేదని ప్రకటించారు. బస్తర్‌లో హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు శాంతి కమిటీలు ఎక్కడున్నాయనీ… నాయకులూ, గ్రామస్తులూ చనిపోయినప్పుడు మావోయిస్టులు ఎందుకు శాంతి చర్చల ప్రతిపాదన చేయలేదని ప్రశ్నించారు.