సింహాచలం కొండపై గోడ నిర్మాణంలో లోపాలు భక్తులు ప్రాణాలు తీశాయా?అంటే అవుననే సమాధానం వస్తోంది. దేవాలయ వైదిక సిబ్బంది రిటెయినింగ్ గోడ నిర్మాణం వద్దని వారించినా పర్యాటక శాఖ ఇంజనీరు మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆగమేఘాలపై చందనోత్సవానికి వారం ముందు గోడ నిర్మాణం చేపట్టారు. బూడిద ఇటుకలతో నాణ్యత లేని నిర్మాణం చేయడం, భారీ వర్షం కురవడంతో భక్తులపై నాసిరకం గోడ కుప్పకూలిందనే విమర్శలు వస్తున్నాయి.
దేవాలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద రూ.54 కోట్లు మంజూరు చేసింది. 2021లో డీపీఆర్ పూర్తి చేశారు. 2023లో టెండర్లు పిలిచారు. ఎట్టకేలకు 2024 మార్చిలో పనులు ప్రారంభించారు.
సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం జరగనున్న నేపథ్యంలో కొన్ని పనులు చేశారు. రూ.11.68 కోట్లతో ప్రయాణీకులు వేచి ఉండే భారీ హాలు, గోడ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దర్శనం తరవాత మాడవీధుల్లోని దుకాణ సముదాయం మీదుగా బస్టాండుకు వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. ఆ దారిలో గోడ వద్దని వైదిక పండితులు సూచించినా పర్యాటక శాఖ ఇంజనీర్లు పెడచెవిన పెట్టారు. కాంక్రీటు గోడ నిర్మాణం చేయకుండా నాణ్యత లేని సిమెంటు ఇటుకలతో మమ అనిపించారు.
చందనోత్సవం నాటికి పూర్తి చేయాలనే హడావుడిలో గోడ నిర్మాణం పూర్తి చేశారు. గోడ పూర్తి చేసి, మెట్లకు టైల్స్ వేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. మచ్చుకైనా పనుల్లో నాణ్యత పరిశీలించిన వారే లేరు.
కనీసం గోడకు పునాదులు తీయకుండా నేలపైనే సిమెంటు ఇటుకలు పేర్చుకుంటూ వెళ్లినట్లు ఓ వీడియో సామాజిక మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాసిరకం నిర్మాణానికి తోడు గోడకు ప్లాస్టరింగ్, క్యూరింగ్ కూడా సరిగా చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. బుధవారం కుండపోత వర్షం పడటంతో ఎగువ కొండ ప్రాంతం నుంచి వరద నీరు ముంచెత్తింది. గోడ నానిపోయి భక్తులపై కుప్పకూలింది. ఇంజనీర్ల నిర్లక్ష్యం ఏడుగురి భక్తుల ప్రాణాలను బలితీసుకున్నాయి.