కేంద్రప్రభుత్వం ఏప్రిల్ 30న కీలకమైన ప్రకటన చేసింది. రాబోయే జనాభా లెక్కల్లో కులాల వారీ గణన చేపడతామని ప్రకటించింది.
బుధవారం సాయంత్రం కేంద్ర క్యాబినెట్ సమావేశం తర్వాత ఆ వివరాలను వెల్లడించిన సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఈ విషయాన్ని వెల్లడించారు. రాబోయే జన గణనలో కులాల వారీ సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతిని ప్రకటించారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కుల గణన చేపట్టాయనీ, అయితే జన గణన అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందనీ చెప్పారు.
త్వరలో జరగబోయే జన గణనలో కులాల వివరాలు సేకరించాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాజకీయ వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ – సిసిపిఎ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు కుల గణనను ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వచ్చాయని ఆయన ఆరోపించారు.
‘‘దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన జనాభా లెక్కలు వేటిలోనూ కులాన్ని చేర్చలేదు. 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోక్సభకు ఒక హామీ ఇచ్చారు. కుల గణన అంశాన్ని క్యాబినెట్లో పరిగణనలోకి తీసుకుంటామని ఆయన అన్నారు. దాని కోసం ఒక మంత్రుల బృందం కూడా ఏర్పడింది. దేశంలోని అత్యధిక రాజకీయ పార్టీలు కుల గణనకు అనుకూలంగా సిఫారసులు చేసాయి. అయినప్పటికే కుల గణనకు బదులు కేవలం కుల సర్వే మాత్రమే చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది’’ అని అశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు.
‘‘కాంగ్రెస్, ఇండీ కూటమిలోని దాని భాగస్వామ్య పక్షాలూ కుల గణన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకున్నారు. భారత రాజ్యాంగంలోని 246వ అధికరణం ప్రకారం కేంద్ర జాబితాలోని 7వ షెడ్యూలులో 69వ అంశంగా ‘సబ్జెక్ట్ సెన్సస్’ను (ఒక ప్రత్యేక అంశానికి చెందిన జన గణన) ఉంచారు. భారత రాజ్యాంగం ప్రకారం జన గణన అనేది కేంద్రానికి చెందిన అంశం. కొన్ని రాష్ట్రాలు కులం లెక్కలు తేల్చేందుకు సర్వేలు నిర్వహించాయి. కొన్ని రాష్ట్రాలు ఆ పనిని సరిగ్గా చేసాయి. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం కుల గణను ఏమాత్రం పారదర్శకత లేకుండా పూర్తిగా రాజకీయ కోణంలోనుంచి కుల సర్వే చేపట్టాయి. ఆ వాస్తవాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, రాజకీయాల వల్ల సామాజిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేలా, కులాల సర్వేలు కాకుండా, జన గణనలో భాగంగానే కుల గణనను పారదర్శకంగా చేపడతాం’’ అని మంత్రి వివరించారు. దానివల్ల సమాజపు సాంఘిక, ఆర్థిక నిర్మాణం బలోపేతమవుతుందని, అది దేశ ప్రగతిని కొనసాగింపజేస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేసారు.
‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, రాబోయే జనాభా లెక్కల్లో కుల గణనను కూడా చేర్చాలని సీసీపీఏ (క్యాబినెట్ కమిటీ ఆఫ్ పొలిటికల్ ఎఫైర్స్) నిర్ణయించింది. భారతదేశపు, భారతీయ సమాజపు విలువలు, ప్రయోజనాలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ చర్యే నిదర్శనం’’ అని అశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు. మోదీ సర్కారు ఇంతకుముందే, సమాజంలోని ఏ వర్గానికీ ఇబ్బంది కలగకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10శాతం రిజర్వేషన్ను ప్రవేశపెట్టిన సంగతిని ఆయన గుర్తు చేసారు.
కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో కుల గణన చేపట్టాలంటూ డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ నాయకులు తమతమ ప్రసంగాల్లో అదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు.