కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా ఎంపికైన బ్రహ్మశ్రీ సత్యవేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ఇవాళ అక్షయ తృతీయ పర్వదిన సందర్భాన సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. కంచి పీఠం ప్రస్తుత అధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామి, తన ఉత్తరాధికారికి సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి అనే దీక్షానామాన్ని ఇచ్చారు.
కాంచీపుర క్షేత్రంలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులచే స్థాపితమైన సర్వజ్ఞ పీఠాధిపతుల పరంపరలో ఏక సప్తతి పీఠాధిపతులుగా సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఉత్తరాధికారి సన్యాస దీక్షా స్వీకరణ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయంలోని జగద్గురు శంకరాచార్యుల సన్నిధిలో ఆ కార్యక్రమం నిర్వహించారు. కామాక్షీ అమ్మవారి ఆలయం నుంచి శ్రీమఠం వరకూ ఊరేగింపు నిర్వహించారు. శ్రీమఠంలో శ్రీ మహాత్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. కంచి పీఠ పరంపరలోని గురువులను స్మరించుకున్నాక సన్యాస దీక్షా కార్యక్రమం జరిగింది.
బ్రహ్మశ్రీ గణేశ శర్మ పూర్వాశ్రమంలో అన్నవరం వాసి ఋగ్వేద ఘనపాఠి యజుస్సామవేద షడంగ వేదాంతాది శాస్త్ర పండితులూ అయిన బ్రహ్మశ్రీ దుడ్డు ధన్వంతరి శర్మ, మంగాదేవి దంపతుల సుపుత్రులు. కొంతకాలం బాసర క్షేత్రంలో సేవలందించారు. కొన్నేళ్ళుగా కంచి పీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు. 2018లో జయేంద్ర సరస్వతీ స్వామివారు మహాసమాధి అయిన తర్వాత విజయేంద్ర సరస్వతి స్వామివారు పీఠాధిపతి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఉత్తరాధికారి నియామకం ఆరేళ్ళ తర్వాత ఇప్పుడు జరిగింది.