తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టల్లో బుధవారం తొమ్మిదో రోజు కూడా భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగింది. బ్లాక్హిల్స్గా పేరుపడిన కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి. ఇప్పటికే అన్ని సరిహద్దు ప్రాంతాలనూ భద్రతా బలగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి.
ఆ క్రమంలోనే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆపరేషన్‌లో పాల్గొని అలసిన బలగాలు వెనక్కి వస్తున్నాయి. వారి స్థానంలో బ్యాకప్ పార్టీలను తరలించారు. భద్రతా బలగాలు మావోయిస్టుల ఆచూకీ తెలుసుకోవడానికి ఉపగ్రహ ఛాయాచిత్రాలు వినియోగిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు. పూజారీ కాంకేర్, నడిపల్లి ప్రాంతాలు మంగళవారం బాంబుల శబ్దాలతో హోరెత్తాయి. ఆ ఆపరేషన్ పర్యవేక్షణ కోసం ఐబీ చీఫ్ తపన్ దేకా స్వయంగా రంగంలోకి దిగారు. రాయ్‌పుర్‌లో ఆపరేషన్‌పై ఆయన ఇప్పటికే కీలక సమావేశం నిర్వహించారు.