పహల్గాంలో ఉగ్రవాదుల దాడి వెనుక సొంతింటి దొంగల హస్తం కూడా ఉందని ముందునుంచీ అనుమానిస్తూనే ఉన్నారు. ఆ అనుమానాలు నిజమని తేలింది. భారత్‌కు చెందిన కశ్మీర్ నుంచి పారిపోయి పాకిస్తాన్లో స్థిరపడిన ఓ ఉగ్రవాది నెట్వర్క్ సాయం చేసిందని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుర్తించింది. లష్కరే తోయిబాకు చెందిన కమాండర్ ఫరూఖ్ అహ్మద్ తేడ్వా కూడా ఆ దాడిలో కీలకపాత్ర పోషించాడని భావిస్తున్నారు.
భారత భద్రతా దళాలు ఇటీవలే కుప్వారాలో ఫరూఖ్ అహ్మద్ ఇంటిని పేల్చివేశాయి. అతను గత రెండేళ్లలో కశ్మీర్లో చాలా ఉగ్రదాడులకు సాయం చేసాడని గుర్తించారు. ఎన్ఐఏ సమాచారం ప్రకారం ఫరూఖ్ మూడు మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సాయం చేశాడు. అతనికి పాకిస్తాన్లో కూడా బలమైన సంబంధాలున్నాయి. 1990-2016 మధ్య ఇరుదేశాలకు పలుమార్లు ప్రయాణించాడు. ప్రస్తుతం పాక్‌లో స్థిరపడిన ఫరూఖ్.. కశ్మీర్‌లోని తన నెట్‌వర్క్‌తో సంబంధాలు పెట్టుకొనేందుకు అతను సెక్యూర్డ్ కమ్యూనికేషన్ యాప్స్‌ను వినియోగిస్తున్నాడు. పహల్గాంలోని ఉగ్రదాడి తర్వాత అతడికి సాయం చేసిన పలువురిని అదుపులోకి తీసుకొన్నారు. ఆ యాప్స్ ఆచూకీ కూడా కనుగొన్నారు. వాటిని ఎలా నియంత్రించాలన్న విషయంపై అధికారులు ఆలోచిస్తున్నారు.
మరోవైపు, ఉగ్రవాదులను గుర్తించడంలో ఎన్ఐఏ అధికారులకు సమస్యలు ఎదురవుతున్నాయి. సాధారణంగా ట్రెక్కింగ్‌కు పర్వతారోహకులు వినియోగించే ఆల్పైన్ క్వెస్ట్ వంటి నేవిగేషన్ యాప్‌ను ఉగ్రవాదులు ఆఫ్‌లైన్ మోడ్‌లో వినియోగించినట్లు తెలుస్తోంది. దానివల్ల వారిని గుర్తించడం సాధ్యం కావడం లేదు. దానికి తోడు ఉగ్రవాదుల వద్ద అల్ట్రాసెట్లు ఉన్నట్లు ఎన్ఐఎ అధికారులు గుర్తించారు. 2023 నుంచి కశ్మీర్ లోయలో ముష్కరులు వీటిని వాడుతున్నారు. వీటిని ఫోన్లకు కూడా అనుసంధానించి.. ప్రత్యేకమైన రేడియో నెట్వర్క్ ద్వారా ఎన్క్రిప్టెడ్ సందేశాలను పంపించవచ్చు. వాటి ద్వారా కేవలం మెసేజ్‌లే కాకుండా చిన్నచిన్న వాయిస్‌నోట్‌లు, వీడియోలు కూడా పంపించవచ్చు. అయితే భద్రతా అధికారులు అల్ట్రాసెట్ సిగ్నల్‌ను కనుగొన్నా.. అది కచ్చితమైన ప్రదేశం చూపించదు.. కనీసం 5 నుంచి 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో గాలింపు చర్యలు చేపట్టాలి. పహల్గాం దాడి తర్వాత అలాంటి సిగ్నల్స్‌ను పసిగట్టగలిగారు కానీ కచ్చితమైన ప్రదేశాన్ని మాత్రం గుర్తించలేదని సమాచారం.