పహల్గాంలో హిందూ పర్యాటకులపై ముస్లిం ఉగ్రవాదుల దాడితో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలో పలు కీలక సమావేశాలు నిర్వహించారు. దేశ భద్రత విషయంలో అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఇవాళ రెండోసారి సమావేశమైంది. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ… సీసీపీఏ సమావేశం జరిగింది. ఇవాళ సాయంత్రం క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించారు.
సీసీపీఏ దేశ రాజకీయాల్లో శక్తివంతమైన బృందం. దాన్ని ‘సూపర్ క్యాబినెట్’ అని కూడా పిలుస్తారు. అత్యంత కీలక సందర్భాల్లో మాత్రమే సీసీపీఏ సమావేశం అవుతుంది. దేశంలోని ముఖ్యమైన రాజకీయ, ఆర్థిక విషయాలను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటుంది. రాజకీయంగా సంక్లిష్టమైన ఆర్థిక విధానాలు, అంతర్గత భద్రతా సమస్యలపై చర్చలు, నిర్ణయాలు ఉంటాయి. దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న అంశాలను ఈ భేటీలో చర్చిస్తారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నేటి సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్‌షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారని సమాచారం.
2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత సీసీపీఏ మళ్లీ సమావేశం కావడం ఇదే మొదటిసారి అన్నది విశేషం. పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనంపై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ దారుణం తర్వాత పరిస్థితిని సమీక్షించిన సీసీపీఏ సమావేశంలోనే… పాకిస్తాన్‌కున్న ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ వాణిజ్య హోదాను రద్దు చేయాలని భారత్ నిర్ణయించింది. మరి కొన్ని రోజులకే, అంటే ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడి చేసి, దాయాదికి బుద్ధి చెప్పింది.